ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గతంలో అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన నేతల్లో ఒకరు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. జగన్ చేతిలో అధికారంలో లేనప్పుడు ఆయనకు దగ్గరగా ఉండేవారు. విపక్షంలో ఉన్న వేళలో జగన్ ను కాదని.. టీడీపీలో చేరిన ఆయన 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలోకి వెళ్లటం తెలిసిందే. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కీలక ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇంతకూ జగన్ తో ఎందుకు చెడింది?జగన్ పు ప్రతి ఒక్కరు సార్ అని మాత్రమే పిలవాలంటారు. దీనికి మీ అనుభవం ఏమిటి? అన్న ప్రశ్నలు ఎదురైనప్పుడు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాటల్ని ఈ ప్రశ్నలకు సమాధానాలుగా చెబితే..
‘‘జగన్ తో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు మంచిదని చెబుతాను. మంచిది అయితే మాత్రం పార్టీ పరంగా చంద్రబాబుకు మంచి పేరు వస్తుంది కదా? అని జగన్ అడిగారు. పట్టిసీమ నీళ్లు ఏపీకి వస్తే.. కృష్ణా జలాలు సీమకు వాడుకోవచ్చుకదా అంటాను నేను. చంద్రబాబు ఓడితేనే కదా మనం గెలిచేది అని జగన్ అంటారు. ఈ వాదనే మా మధ్య విభేదానికి మొదటి కారణం’’
‘మా వియ్యంకుడు చంద్రశేఖర్ ద్వారా ఒక రాయబారం పంపారు. మేఘా కృష్ణారెడ్డి దగ్గర కొన్ని పనులు తీసుకోవచ్చు కదా అన్నారు. నాకు అక్కర్లేదని చెప్పా. అసెంబ్లీ బాయ్‌కాట్ చేయమంటే కాదన్నాను. దాంతో విభేదాలు ఎక్కువయ్యాయి’
‘కొద్ది రోజుల తర్వాత ఇప్పటి శ్రీశైలం ఎమ్మెల్యే ద్వారా చంద్రబాబు నుంచి రాయబారం వచ్చింది. అప్పట్లో తొలుత లోకేశ్ తో మాట్లాడా. ఆ సందర్భంగా లోకేశ్ తో మాట్లాడా. జగన్ మాదిరి సార్ అని పిలవాలంటే కుదరదని చెప్పా. దానికి లోకేశ్ స్పందిస్తూ అన్నా.. నేను మీ కొడుక్కంటే చిన్నోడ్ని.. పేరుపెట్టి పిలిచినా అభ్యంతరం లేదన్నాడు. జగన్ ను ఒక్కసారి కూడా సార్ అని పిలవలేదు’’
‘‘జగన్ కు అహం ఎక్కువ. ఆయన ముందు కుర్చీలో కూడా కూర్చునే పరిస్థితి ఎవరికీ లేదు. సార్ అని తనను పిలవాలని మిగిలిన వారందరికి కండీషన్ పెట్టాడు. నాకు సార్ అని పిలవటం ఇష్టం ఉండదు. జగన్ సిట్ అంటే సిట్. స్టాండ్ అంటే స్టాండ్. జగన్ వానపాము చూపించి నాగపాము అంటే జగన్ పార్టీలోని వారు.. అమ్మో ఎంత పెద్ద పడగ అనే వాళ్లు. అంతా వందిమాగధులే. నేను వందేమాతరం అనేవాడిని’’ అని వ్యాఖ్యానించారు. జగన్ పార్టీలోకి వెళతారా? అంటే.. నేను మరో వైఎస్ వివేకానందరెడ్డిని కాదలుచుకోలేదని పేర్కొనటం గమనార్హం.