నాలుగేళ్ల‌యినా.. ఈ ‘క్ర‌య్యింగ్’ బాలేదు అంబ‌టి స‌ర్‌!!

పోలిగా పోలిగా బొంక‌రా.. అంటే టంగుటూరు మిరియాలు తాటికాయ‌లంత‌! అన్న‌ట్టుగా.. ఇంకా.. చంద్ర‌బా బు – ఆయ‌న పాల‌న‌-అప్ప‌టి న‌ష్టం-ఇప్ప‌టి క‌ష్టం.. అంటూ.. ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు క‌న్నీరు పెడు తూ చెబుతున్నార‌ని నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ఏమైంది స‌ర్‌.. అని అడ‌గ‌డ మే పాపం.. లాంగ్ లాంగ్ ఏగో.. అంటూ.. చంద్ర‌బాబు హ‌యాంలోకి ప‌రుగులు పెడుతున్నారు అంబ‌టి.

తాజాగా మ‌రోసారి పోల‌వ‌రంపై ఆయ‌న మాట్లాడారు. చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగిన త‌ప్పుల కార‌ణంగానే ప్రాజెక్టు ఆల‌స్యం అవుతోంద‌ని చెప్పారు. అంతేకాదు.. పోలవరం ప్రాజెక్ట్‎లో డయా ఫ్రమ్ వాల్ 485 మీటర్లు దెబ్బతిందని, మొత్తం 1,396 మీటర్ల గ్యాప్ 2 లోని డి.వాల్‎లో 4 చోట్ల ఈ నష్టం జరిగిందని తెలిపారు. నేషనల్ హైడ్రాలిక్ పవర్ కార్పొరేషన్ పూర్తి పరిశోధనలు చేసి నివేదిక ఇచ్చిందన్నారు.

గతంలో డి.వాల్ నిర్మాణానికి రూ.400 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు. ఇప్పుడు డి.వాల్ మరమ్మతులకు రూ.2 వేల కోట్లు పైనే ఖర్చు అవుతుందని, శాస్త్రీయంగా మరమ్మతులు చేయాలని నిపుణులు చెప్పార‌ని అంబ‌టి చెప్పుకొచ్చారు. లీకేజ్ ఉన్న చోట్ల 45 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకతో ఫిల్లింగ్ చేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం అవగాహన లోపం, మాజీ సీఎం చంద్రబాబు తప్పిదం వల్లే ఈ నష్టానికి కారణమని అంబటి మండిపడ్డారు.

నెటిజ‌న్ల కామెంట్ ఏంటంటే.. చంద్ర‌బాబు, ఆయ‌న పాల‌న ముగిసి నాలుగేళ్లు అయిపోయింది. ఇంకా.. ఇప్ప‌టికీ ఆ న‌ష్టాలు.. ఆ క‌ష్టాలు చెప్పుకోవ‌డం అంటే.. 1వ త‌ర‌గ‌తి పిల్లాడు.. పెన్సిల్ క‌ష్టాలు చెప్పిన‌ట్టుగా ఉంద‌ని.. 6వ త‌ర‌గ‌తి విద్యార్థి.. ఆవు వ్యాసం రాసిన‌ట్టు ఉంద‌ని.. వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. త‌మ‌రు చేసింది ఏంటి స‌ర్‌.. అని అంబ‌టిని నిల‌దీస్తున్నారు.