జగన్ ను ఇరకాటంలో పెట్టిన టీడీపీ పథకం ఇదేనా?

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, చేపడతామన్న సంక్షేమ పథకాలను, మేనిఫెస్టోను బట్టి ప్రజలు ఆయా పార్టీలకు ఓట్లు వేసి గెలిపిస్తుంటారు. అందుకే, ఏ పార్టీ అయినా తాము ఇచ్చిన హామీలను, చేపడతామన్న సంక్షేమ పథకాలను సాధ్యమైనంత వరకు నెరవేర్చేలా చూస్తుంది.

అయితే, ఇప్పటివరకు ఏపీలో అధికారం చేపట్టిన పార్టీలన్నీ రకరకాల ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. అయితే, అన్ని సంక్షేమ పథకాలకు ప్రజల్లో ఆదరణ లభించినా….వాటిలో కొన్ని మాత్రమే బలంగా ప్రజల్లోకి వెళుతుంటాయి. అలా ప్రజల మనసుల్లో సెంటిమెంట్ గా నాటుకుపోయిన పథకాలే ఆయా పార్టీలకు మరోసారి అధికారాన్ని కట్టబెట్టిన సందర్భాలూ ఉన్నాయి.

ఇక, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో కొన్నింటిని పక్కకు పెట్టిన ప్రభుత్వాలను జనం విస్మరించిన సందర్భాలూ ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ…అదే తరహాలో గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ పథకాన్ని విస్మరిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆ పథకాన్ని కంటిన్యూ చేయకుంటే….ప్రజల సెంటిమెంట్ దెబ్బతిని మిగతా రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బంది కలిగే అవకాశముందని చెబుతున్నారు. టీడీపీ హయాంలో బాగా పాపులర్ అయిన అన్న క్యాంటీన్ల పై ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను వైసీపీ గుర్తించాలని అంటున్నారు.

ఏపీ ప్రజ‌ల మనసులను తాకిన పథకాలు చాలా అరుదు. అటువంటి ప‌థ‌కాల్లో రెండు రూపాయ‌ల‌కే కిలో బియ్యం పథకం ఒకటి. ప్రజలంతా అన్నగారి బియ్యం అంటూ పిలుచుకునే ఈ పథకం…నిజంగానే అన్నగారిని రెండోసారి అధికారంలోకి తీసుకువ‌చ్చింది. అదే తరహాలో 2004లో దివంగత నేత వైఎస్ రాజ‌శేఖర్‌‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ ప‌థ‌కం జనాల్లో బాగా పాపులర్ అయింది.

ఆరోగ్యశ్రీ తో వైఎస్ ఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. పక్క రాష్ట్రాలూ ఈ పథకాన్ని కాపీ కొట్టేలా ఈ పథకం జనాల్లోకి చొచ్చుకుపోయింది. ఈ ప‌థ‌కంతోనే వైఎస్ రెండోసారి అధికారాన్ని చేపట్టారు. ఇక, అదే తరహాలో చంద్రబాబు ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లు జనానికి బాగానే కనెక్ట్ అయ్యాయి.

రూ.5కే టిఫిన్‌, రూ.5కే మ‌ధ్యాహ్న భోజ‌నం, రూ.5కే రాత్రిపూట భోజ‌నం లేదా టిఫిన్ అందించే ఈ పథకం భారీగా సక్సెస్ అయింది. అయితే, జ‌గ‌న్ స‌ర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ క్యాంటీన్లు తెరుచుకోలేదు.

కానీ, ప్రజ‌ల్లో ఈ ప‌థ‌కంపై సెంటిమెంట్ అలానే ఉంది. అన్నక్యాంటీన్లను తిరిగి ప్రారంభించాల‌ని 85 శాతం మంది ప్రజ‌లు కోరుతున్నార‌ని గ్రామ వలంటీర్ల సర్వేలోనూ తేలింది. దీంతో ఈ పథకం పున:ప్రారంభంపై వైసీపీ స‌ర్కారు మ‌ల్లగుల్లాలు ప‌డుతోంది. రాబోయే ఎన్నిక‌ల్లో ఈ పథకం అమలు ప్రభావం పడవచ్చని బలంగా నమ్ముతోందట.

అయితే, అనూహ్యంగా జగన్ ఏడాది పాలనలో ఈ పథకం లేని లోటు ప్రజలకు స్పష్టంగా కనిపించింది. ఇసుక కొరత వల్ల పనులు లేక ఇబ్బంది పడ్డ భవన నిర్మాణ కార్మికులు…ఆయా కూలీలకు ఈ పథకం లోటు బాగా తెలిసొచ్చింది. ఇపుడు, కరోనా సమయంలోనూ ఆ పథకం ఉంటే…చాలామంది అన్నార్తి తీరి ఉండేదని ప్రచార జరుగుతోంది.

జగన్ కు అనూహ్యంగా దెబ్బకొట్టిన ఏకైక పథకం ఇదేనని చెప్పవచ్చు. అందుకే, టీడీపీ….అన్న క్యాంటీన్ల వ్యవహారాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారి లేవనెత్తుతూ ప్రజల్లో ఆ పథకంపై ఉన్న సెంటిమెంట్ ను రెచ్చగొడుతోంది. మరి, సాధ్యమైనంత త్వరగా అన్న క్యాంటీన్లపై జగన్ ఫోకస్ చేస్తే….రాబోయే ఎన్నికల్లో ఆ మైలేజి తప్పక కనిపిస్తుందనడంలో సందేహం లేదు.