పెద్దిరెడ్డి సీఎం అవ్వాలని ప్లాన్ చేస్తున్నారా ?

జగన్మోహన్ రెడ్డికి సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య విభేదాలు సృష్టించటమే నారా లోకేష్ టార్గెట్ గా పెట్టుకున్నట్లున్నారు. అందుకనే పుంగనూరులో పాదయాత్రలో పెద్దిరెడ్డిని లోకేష్ గట్టిగా టార్గెట్ చేశారు. పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపించారు. జగన్ గనుక జైలుకు వెళితే తాను సీఎం అయిపోవాలని పెద్దిరెడ్డి వెయిట్ చేస్తున్నారట. జగన్ జైలుకు వెళతారని తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని లోకేష్ గుర్తుచేశారు.

మంత్రివర్గంలో కీలకంగా ఉండికూడా చిత్తూరు జిల్లాకు పెద్దిరెడ్డి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రం మొత్తంమీద జగన్ పాలనలో నష్టపోయిన జిల్లా ఏదన్నా ఉందంటే అది చిత్తూరు జిల్లా మాత్రమే అన్నారు. పెద్దిరెడ్డి కారణంగానే జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. మంత్రివర్గంలో, ప్రభుత్వంలో ఇంత కీలకంగా ఉన్న పెద్దిరెడ్డి జిల్లాకు పరిశ్రమలను ఎందుకు సాధించలేకపోతున్నారని సూటిగా ప్రశ్నించారు. పెద్దిరెడ్డి అరాచకాల కారణంగానే పారిశ్రామికవేత్తలు భయపడి జిల్లావైపు చూడటంలేదని చెప్పారు.

తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రాగానే జిల్లాతో పాటు పుంగనూరును అన్నీ విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పుంగనూరు అభివృద్ధిని వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకుంటానని లోకేష్ చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే పరిశ్రమల ఏర్పాటుతో పాటు జాబ్ కాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. బడుగు, బలహీన వర్గాలకే కాకుండా అగ్రకులాల్లోని పేదల అభివృద్ధికి కూడా అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ముఖ్యంగా స్వయంఉపాధికి అవకాశమున్న మార్గాలను బాగా డెవలప్ చేస్తానని ప్రకటించారు.

అభివృద్ధి అంటే ఏమిటో పుంగనూరు రూపురేఖలను మార్చి తాను చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇపుడు పార్టీ నేతలను, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్న పెద్దిరెడ్డి గ్యాంగును ఎట్టి పనిస్ధితుల్లోను వదిలేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. వచ్చేఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేయబోతున్న చల్లా రామచంద్రారెడ్డి (బాబు)ను అత్యధిక మెజారిటితో గెలిపించాలని పార్టీ శ్రేణులతో పాటు జనాలను కూడా లోకేష్ అభ్యర్ధించారు.