ఏపీ అప్పుల లెక్క తేల్చుతున్న కేంద్రం

ఆంధ్రప్రదేశ్ అప్పుల లెక్కలను కేంద్రం సేకరిస్తోంది. ఈ మేరకు రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి లేఖ చేరింది. అందులో వారికి కావాల్సిన వివరాలు అడిగారు. రాజ్యసభలో ఏపీ అప్పులపై ప్రశ్న రావడంతో అందుకు సమాధానం ఇచ్చేందుకు గాను కేంద్రం ఈ వివరాలు సేకరిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగిన 2014 నుంచి వివరాలు చెప్పాలంటూ రాజ్యసభలో ఒక సభ్యుడి నుంచి ప్రశ్న రావడంతో అందుకు సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు కేంద్రం ప్రక్రియ ప్రారంభించింది. 2014 జూన్‌ మూడో తేదీ నుంచి గతేడాది అక్టోబరు వరకు చేసిన అప్పుల వివరాలు సమర్పించాలని కేంద్ర ఆర్థికశాఖ కోరింది. సంవత్సరాల వారీ లెక్కలు ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఈ మొత్తం అప్పుల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల వివరాలు కూడా ఇవ్వాలని పేర్కొంది. పలు సంస్థలు, ప్రభుత్వం నేరుగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల వివరాలు బ్యాంకుల వారీ సమర్పించాలని స్పష్టం చేసింది. నాబార్డు వంటి వాటి రుణాలు కూడా చెప్పాలని లేఖలో పేర్కొంది.

2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వాలు తీసుకుంటున్న రుణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజ్యసభలో జరిగే చర్చ కీలకం కానుంది. టిడిపి, వైసిపి మధ్య ఈ వివాదం చాలా కాలంగా నడుస్తూనే ఉంది. సంవత్సరం, బ్యాంకు, కార్పొరేషన్‌, ప్రభుత్వ రంగ సంస్థల వారీ వివరాలు కోరడంతో రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు కూడా వివరాల కోసం కుస్తీ పడుతున్నారు.

మరోవైపు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల వివరాలను అధికారులు బయటపెట్టలేదు. కేంద్రం, కాగ్‌, రిజర్వు బ్యాంకు వంటి సంస్థలు కార్పొరేషన్‌ రుణాలపై పదేపదే రాష్ట్ర ఆర్థికశాఖకు లేఖలు రాస్తున్నాయి. ఇప్పుడు రాజ్యసభలో ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉండడంతో కేంద్రం ఎలాగైనా ఈ వివరాలను రాష్ట్రం నుంచి తెలుసుకుంటుంది. అయితే… ఈసారైనా ఏపీ అధికారులు ఈ వివరాలు ఇస్తారా లేదా అనేది చూడాలి. ఏపీ నుంచి పూర్తి వివరాలు అందితే కేంద్ర ఆర్థిక శాఖ రాజ్యసభలో సమాధానం చెప్తుంది.