కేజ్రీవాల్‌కు కేసీఆర్ వెన్నుపోటు పొడిచారా?

New Delhi, May 22 (ANI): Telangana Chief Minister K Chandrashekar Rao meets Delhi Chief Minister Arvind Kejriwal, at his residence, in New Delhi on Sunday. (ANI Photo/ ANI Pic Service)

కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టాక దేశంలో ఆయన వెన్నంటే ఉంటున్న నాయకుల్లో కేజ్రీవాల్ పేరు ముందు వరుసలో ఉంటుంది. కేసీఆర్ కూడా కేజ్రీవాల్‌ను కలుపుకొంటూ పోతున్నారు. ఇక్కడి పథకాలు అక్కడ, అక్కడి పథకాలు ఇక్కడ అమలు చేస్తామని చెబుతూ ఇద్దరు ముఖ్యమంత్రులు మంచి జుగల్బందీగా సాగుతున్నారు. బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీల జుగల్బందీ గురించి మాట్లాడినప్పుడు కొందరైతే ఈ రెండు పార్టీలు లిక్కర్ కుంభకోణంలోనూ కలిసే నడిచాయంటూ విమర్శలు కూడా చేస్తుంటారు.

ఇదంతా బాగానే ఉన్నా కేసీఆర్ తన పార్టీని ఇతర రాష్ట్రాలలో విస్తరించే క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలనుచేర్చుకోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఇంతవరకు లేకపోయినా కేసీఆర్‌ను విమర్శించేవారు మాత్రం ఆయన తీరును తప్పు పడుతున్నారు.

మహారాష్ట్రలో మాజీ ఎంపీ, ఆప్ మహారాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ హరిభవ్ రాథోడ్ బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన ఆప్ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఆయనతో పాటు చంద్రాపూర్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సందీప్ కరపే కూడా బీఆర్ఎస్‌లో చేరారు. మరికొందరు మండలస్థాయి బీజేపీ, శివసేన నాయకులూ చేరారు. వీరంతా ప్రగతి భవన్‌లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

మరి… ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను చేర్చుకునేటప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌కు కేసీఆర్ సమాచారం ఇచ్చారో లేదో తెలియదు కానీ .. రెండు పార్టీల మధ్య పొత్తు తరహా స్నేహం కొనసాగుతున్న తరుణంలో మిత్రపక్షం నుంచి నాయకులను చేర్చుకోవడం రాజనీతి కాదంటున్నారు విమర్శకులు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కలసికట్టుగా రాజకీయం చేసి రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తూ.. తనతో కలిసి వస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నాయకులను తన పార్టీలోకి చేరుకోవడమంటే కేజ్రీవాల్‌కు కేసీఆర్ వెన్నుపోట పొడవడమేనని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.