కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో సీనియర్ నేత వరుపుల రాజా మరణించటం టీడీపీకి పెద్ద లాసనే చెప్పాలి. ఈయన పోయిన ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో పోటీచేసి చాలా తక్కువ తేడాతో ఓడిపోయారు. కాపు సామాజికవర్గంలోని ప్రముఖుల్లో రాజా కూడా ఒకళ్ళు. ఉత్తరాంధ్ర ఎంఎల్సీ ఎన్నికల్లో బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాలకు రాజా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అభ్యర్ధుల గెలుపుకు బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ప్రచారానికి కాస్త విరామం ఇచ్చి శనివారం మధ్యాహ్నమే ప్రత్తిపాడుకు చేరుకున్నారు.
పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు బంధువులతో పాటు రాత్రి 8.3 గంటలవరకు కబుర్లు చెబుతునే ఉన్నారు. 9 గంటల ప్రాంతంలో హఠాత్తుగా గుండెపోటు రావటంతో వెంటనే కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 11.30 గంటల ప్రాంతంలో మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. రాజాకు గతంలోనే రెండుసార్లు గుండెపోటు రావటంతో స్టంట్లు వేశారు. మూడోసారి మాత్రం మరణాన్ని తప్పించుకోలేకపోయారు. 47 ఏళ్ళ వయసులో గుండెపోటుతో రాజా మరణించటం కుటుంబంతో పాటు పార్టీకి తీరని నష్టమనే చెప్పాలి.
రాబోయే ఎన్నికల్లో ప్రత్తిపాడులో పోటీచేయాలని రాజా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాపు సామాజికవర్గంలో పట్టున్న కారణంగా వచ్చేఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇప్పటినుండే ప్లాన్ చేసుకుంటున్నారు. పోయిన ఎన్నికల్లో కూడా రాజా కొద్ది తేడాతోనే ఓడిపోయారు. వైసీపీ అభ్యర్ధి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కు 76,574 ఓట్లొస్తే, రాజాకు 71,908 ఓట్లొచ్చాయి. జనసేన తరపున పోటీచేసిన వరుపుల తమ్మయ్యబాబుకు 6907 ఓట్లు పోలయ్యాయి.
జనసేన అభ్యర్ధి రంగంలో లేకపోతే ఫలితం ఎలాగుండేదో తెలీదు. జనసేన పోటీలో లేకపోతే తానే గెలిచుండే వాడినని రాజా చాలాసార్లు చెప్పుకున్నారు. అందుకనే వచ్చేఎన్నికల్లో ఎలాగైనా గెలవాల్సిందే అని పట్టుదలగా ఉన్నారు. జనసేనతో పొత్తు ఉంటుందన్న నమ్మకంతో గెలుపు ఖాయమని కూడా అనుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్ధితుల్లోను గుండెపోటుతో మరణించటం నిజంగా దురదృష్టమనే చెప్పాలి. గతంలో జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్ గాను, ఆప్కాబ్ వైస్ ఛైర్మన్ గా కూడా రాజా పనిచేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates