రేవంత్ ఒంటరైపోయారా ?

తెలంగాణా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఒంటరైపోయారు. పీసీసీ అధ్యక్షుడు ఒంటరైపోవటం బహుశా ఇదే మొదటిసారేమో. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన నేతలకు వ్యతిరేకంగా మరికొంతమంది నేతలుండేవారు. అయితే అధ్యక్షులకు కూడా బలమైన వర్గముండేది. కాబట్టి తన వ్యతిరేకులను పీసీసీ ప్రెసిడెంట్లు ధీటుగా ఎదుర్కోనేవారు. కానీ ఇపుడు రేవంత్ పరిస్ధితి గతానికి భిన్నంగా తయారైంది. ఏ విషయంలో కూడా సీనియర్లలో చాలామంది అధ్యక్షుడికి సహకరించటంలేదు.

తాజాగా జరిగిన ఎపిసోడే దీనికి ఉదాహరణ. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో సీనియర్ నేత మహేశ్వరరెడ్డి పాదయాత్ర మొదలుపెట్టారు. ఒకవైపు రేవంత్ పాదయాత్ర చేస్తుంటే మరోవైపు మహేశ్వర్ పాదయాత్ర మొదలుపెట్టడం ఏమిటో అర్ధంకావటంలేదు. ఒకేసారి రేవంత్, మహేశ్వర్ పాదయాత్రలు చేస్తుండటంతో పార్టీ నేతల మధ్య అయోమయం పెరిగిపోతోంది. ఎవరి పాదయాత్రలో పాల్గొనాలో కొందరికి అర్ధంకావటంలేదు. పైగా భైంసాలో మొదలైన పాదయాత్రలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, దామోదర్ రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి అనేకమంది సీనియర్లు పాల్గొన్నారు.

సీనియర్ల ఆలోచన చూస్తుంటే రేవంత్ ను పార్టీలో ఒంటరిని చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. వీళ్ళెవరు కూడా రేవంత్ చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనటంలేదు. రేవంత్ గాంధీభవన్ కు వస్తే వీళ్ళెవరూ కనబడరు. వీళ్ళలో ఎవరైనా పార్టీ ఆఫీసుకు వచ్చినపుడు రేవంత్ లోపల ఉన్నాడని తెలియగానే బయటనుండి బయటకే వెళిపోతారు. ఇదంతా చూస్తుంటే సీనియర్లలో చాలామంది కూడబల్లుకునే రేవంత్ ను దూరం పెడుతున్నట్లు అర్ధమైపోతోంది.

వీళ్ళంతా సరిపోరన్నట్లు మరో సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత కంపుచేయాలో అంతా చేస్తున్నారు. రేవంత్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వెంటనే వాళ్ళకి ఎంపీ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇపుడే రేవంత్ పరిస్ధితి ఇలాగుంటే రేపు ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో ఇంకెంత గొడవ అవుతుందో చెప్పక్కర్లేదు. చూస్తుంటే టికెట్ల కేటాయింపులో రేవంత్ కు ఎలాంటి పాత్రలేకుండా చేయాలనే ఆలోచన సీనియర్లలో ఉన్నట్లు అనుమానంగా ఉంది. పరిస్దితి ఇలాగే ఉంటే చివరకు రేవంత్ ఒంటరిగానే మిగిలిపోవటం ఖాయమని అనిపిస్తోంది.