లోకేష్ తీరుపై తిరుపతి టీడీపీ అసంతృప్తి

జనవరి 27న ప్రారంభమైన నారా లోకేష్, యువగళం పాదయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. నేడో రేపో 500 కిలోమీటర్ల మైలురాయిని దాటుతున్న తరుణంలో ఆయన రోజుకో హామీ ఇస్తున్నారు. తన హామీలను అమలు చేస్తానని భరోసా కల్పించే దిశగా అక్కడక్కడా శిలాఫలకాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానితో సామాన్య జనానికి లోకేష్ పై విశ్వాసం పెరుగుతోంది.

లోకేష్ ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాల పర్యటనలో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. నగరి, చంద్రగిరి, పుంగనూరు ఇలా చెప్పుకుంటూ పొతే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడం, వారి అనుచరులు సంబరాలు చేసుకోవడం కూడా జరిగిపోయింది. అయితే పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, తిరుపతి నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఆయన ప్రకటించలేదు.

సుగుణమ్మకు క్లాస్

తిరుపతి నియోజకవర్గ కేండెట్ ను ప్రకటించకపోగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు లోకేష్ క్లాస్ తీసుకున్నారు. అదీ ఆమె అనుచరుల సమక్షంలోనే తీవ్రస్తాయిలో విరుచుకపడటంతో సుగుణమ్మకు దిక్కుతోచలేదట. తాను చంద్రబాబు లాంటి మెతక వైఖరి నేతను కాదని, అందరి సంగతి తెలుసని, సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కరి సంగతి చెబుతానని లోకేష్ వార్నింగ్ ఇవ్వడంతో తిరుపతి టీడీపీ శ్రేణులు అవాక్కయినట్లు సమాచారం. పాదయాత్రను సక్సెస్ చేసేందుకు తాము అహర్నిశలు కృషి చేస్తే లోకేష్ ఇలా మాట్లాడుతున్నారేమిటని తిరుపతి నేతలు విస్తుపోయారట.

నిజానికి సుగుణమ్మ భర్త వెంకటరమణ 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఆయన హఠాన్మరణంతో 2015లో జరిగిన ఉప ఎన్నికల్లో సుగుణమ్మ విజయం సాధించారు. అయితే నియోజకవర్గంలో ఆమె పట్టు సాధించలేకపోయారన్న చర్చ మొదటి నుంచి ఉంది. 2019 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఆమె ఓడిపోయారు. ఇక సుగుణమ్మను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్న చంద్రబాబు ఆ దిశగా ఇతర నేతలను ప్రోత్సహిస్తున్నారు. అయినా ఆమె మాత్రం రోజూ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ 2024లో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ పాదయాత్ర సందర్భంగా తిరుపతిలో జరిగిన పార్టీ మీటింగ్ లో సుగుణమ్మ పనితీరుపై లోకేష్ ఆగ్రహం చెందారు..

పవన్ కల్యాణ్ కోసమేనా..

టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా తిరుపతి నియోజకవర్గాన్ని పవన్ కల్యాణ్ పార్టీకి కేటాయించాలని చంద్రబాబు అండ్ కో భావిస్తున్నారు. స్వయంగా పవన్ కల్యాణే అక్కడ నుంచి పోటీ చేసినా ఆశ్చర్యం లేదన్న చర్చ మొదలైంది. అక్కడ బలిజ సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో పాటు పవన్ అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారన్న ఫీలింగ్ తో వైసీపీని ఓడగొట్టాలంటే జనసేనకు ఆ నియోజకవర్గాన్ని వదిలెయ్యాలని టీడీపీ భావిస్తోంది. పవన్ కాకపోయినా జనసేన తరపున బలిజ నాయకులు పోటీ చేస్తే గెలుపు గుర్రం ఎక్కడం సులభమేనని చెబుతున్నారు. అందుకే మీకు టికెట్ లేదు మేడమ్ అని సుగుణమ్మకు లోకేష్ పరోక్షంగా సందేశమిచ్చారన్న టాక్ నడుస్తోంది. అయితే ఇంతకాలం పనిచేసి చివరకు జనసేనకు వదులుకోవడమేంటని తిరుపతి కేడర్ అసంతృప్తిగా ఉంది. వారిని ఎలా బుజ్జగిస్తారో చూడాలి….