ఏం జరిగింది : ప్రముఖులతో ప్రత్యేక విందుకు సీఎం జగన్ డుమ్మా

Y S Jagan

ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం వేళలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు.. పలువురు పారిశ్రామికవేత్తలు హాజరు కావాల్సి ఉంది. సాధారణంగా ఇలాంటి పెద్ద సదస్సుల సందర్భంగా ఏర్పాటు చేసే విందునకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అయితే.. ఈ ప్రత్యేక విందునకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడుచర్చనీయాంశంగా మారింది.

శుక్రవారం ఉదయం మొదలైన సదస్సుకు ఏపీ ప్రభుత్వ అంచనాలకు తగ్గట్లే.. వ్యాపార దిగ్గజాల్ని తీసుకురావటంలో సఫలం కావటమే కాదు.. వారి చేత తాము ఏపీలో పెట్టే పెట్టుబడుల గురించి మాట చెప్పించటం ద్వారా.. పెట్టుబడిదారుల సదస్సును సూపర్ హిట్ చేయటంలో సక్సెస్ అయ్యారు. ఒకరోజులోనే 13 లక్షల కోట్ల విలువైన వ్యాపార డీల్స్ ను ఏపీ ప్రభుత్వం చేసుకుందని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చెప్పటం తెలిసిందే.

అంచనాలకు మించి భారీగా వచ్చినట్లుగా పేర్కొన్న పెట్టుబడుల నేపథ్యంలో.. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక విందులోనూ ప్రముఖులు తళుక్కుమంటారని భావించారు. అనూహ్యంగా ఈ ప్రత్యేక విందునకు డుమ్మా కొట్టారు, ఆసక్తికరమైన మరో విషయం ఏమంటే.. ఈ ప్రత్యేక విందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హాజరు కాలేదు. తాను హోస్టు చేయాల్సిన విందుకు జగన్ రాకపోవటం ఏమిటన్న ఆరా పలువురి నుంచి వచ్చింది.

అయితే.. అసలు విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. సదస్సుకు హాజరైన దిగ్గజ వ్యాపారులంతా సాయంత్రానికే విశాఖ నుంచి బయలుదేరి వెళ్లిపోవటంతో.. ప్రముఖులు ఎవరూ లేని పరిస్థితి. దీంతో.. ముఖ్యమంత్రి జగన్ సైతం ప్రత్యేక విందుకు రాకుండా డుమ్మా కొట్టినట్లుగా చెబుతున్నారు. ఒప్పందాలు అయినట్లుగా ప్రకటించిన తర్వాత ఎవరికి వారుగా ప్రముఖులంతా తిరుగుముఖం పట్టటంతో.. సదస్సు దగ్గర కోలాహలం కాస్త తగ్గిన పరిస్థితి. దీని ప్రభావం ప్రత్యేక విందు మీద కూడా పడిందని చెబుతున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలు వెళ్లిపోయినంత మాత్రాన.. మిగిలిన వారితో కలిసి ప్రత్యేక విందునకు ముఖ్యమంత్రి జగన్ హాజరైతే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.