వేడెక్కిన స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ రాజ‌కీయం..

తెలంగాణ‌లో మ‌రో 10 మాసాల్లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అధికార పార్టీ బీఆర్ ఎస్ అన్ని అస్త్ర శ‌స్త్రాల‌తో రెడీ అవుతోంది. ముచ్చ‌ట‌గా మూడోసారి కూడా విజ‌యం ద‌క్కించుకుని హ్యాట్రిక్ కొట్టాల‌నేది కేసీఆర్ వ్యూహం. అయితే.. ఆయ‌నఅనుకుంటున్న‌ట్టుగా క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క విధంగా బీఆర్ ఎస్ ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఉదాహ‌ర‌ణ‌కు జ‌నగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజ‌క‌వ‌ర్గాన్ని తీసుకుంటే.. ఈ సీటును ఇద్ద‌రు కీల‌క నేత‌లు ఆశిస్తున్నారు. ఇద్ద‌రూ ఎస్సీ సామాజిక వ‌ర్గానికిచెందిన నాయ‌కులు.. పైగా కేసీఆర్ స‌ర్కారులో ఇద్ద‌రూ డిప్యూటీసీఎం(డీసీఎం)లుగా ప‌నిచేసిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఇద్ద‌రూ కూడా గ‌తంలో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. వారే ఒక‌రు రాజ‌య్య‌. మ‌రొక‌రు క‌డియం శ్రీహ‌రి.

ప్ర‌స్తుతం రాజయ్య గ‌త నాలుగు ఎన్నిక‌లుగా విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ ఎస్‌లోకి జంప్ చేసిన ఆయ‌న‌కు.. టీడీపీ నుంచి వ‌చ్చి డిప్యూటీ సీఎం చేసిన క‌డియం శ్రీహ‌రికి మ‌ధ్య అస‌లు ప‌డ‌డం లేదు. క‌డియం కూడా మూడు సార్లు ఇక్క‌డ విజయం ద‌క్కించుకున్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కోసం ఇద్ద‌రూ కుస్తీ ప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలోనే వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌తో పైచేయి సాధించేందుకు రోడ్డున ప‌డుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పరస్పర విమర్శలు చేసుకోవటంతో ఇన్నాళ్లు గుట్టుగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు ఎక్కుపెడుతు న్నారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు, కడియం శ్రీహరి హయంలో ఘనపురంలోనే అత్యధికంగా ఎన్కౌంటర్లు జరిగాయని.. 361 మందిని పొట్టనపెట్టుకున్నారని ఇటీవ‌ల రాజయ్య చేసిన విమ‌ర్శ‌లు కాక రేపాయి.

ఇక, క‌డియం కూడా త‌క్కువ‌కాకుండా.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజయ్య చిల్లర చేష్టలు, అవినీతి, తాగుడు, వ్యవహారాలకు సంబంధించి తన దగ్గర అన్ని రికార్డ్లు ఉన్నాయన్నారు. అవి బయటపెడితే.. రాజయ్య బయట తిరగలేరని వ్యాఖ్యానించారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ ఎస్ నేత‌లు త‌లెత్తుకుని తిరిగే ప‌రిస్థితి లేకుండా పోయింది. మ‌రి ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునైనా.. కేసీఆర్ వీరిని క‌ట్ట‌డి చేస్తారో.. లేదో చూడాలి.