పార్టీ మార‌తా.. ప‌ద‌వి ఇస్తారా?

ఆవిడ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క మ‌హిళా నాయ‌కురాలు. పైగా ఫైర్ బ్రాండ్‌. భారీ ఎత్తున కాదు లే కానీ.. ఓ రేంజ్‌లో ఆమె చేసే కామెంట్లు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తుంటాయి. ఆమే.. ఏపీ కాంగ్రెస్ మ‌హిళా నాయ‌కురాలు.. సుంక‌ర ప‌ద్మ‌శ్రీ. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. మ‌హిళ‌ల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయ‌కురాలు.

పైగా, రాజ‌ధాని అమ‌రావ‌తిని స‌మ‌ర్థిస్తున్న వారిలో ముందున్న నాయ‌కురాలు కూడా. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు కూడా అమ‌రావ‌తి గ‌ళం వినిపించారు. పార్టీలోనూ ఆమెకు తిరుగులేదు. అయితే, ఆమెను త‌మ వైపు తిప్పుకొనేందుకు టీడీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. గ‌త ఏడాదిన్న‌ర‌గా ఇరు ప‌క్షాల మ‌ధ్య పార్టీమార్పున‌కు సంబంధించి అనేక ర‌హ‌స్య చ‌ర్చ‌లుకూడా జ‌రిగాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అవి ఒక కొలిక్కి రాలేదు.

అంతేకాదు.. సాకే శైల‌జానాథ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఉన్న స‌మ‌యంలో ఈ చ‌ర్చ‌ల విష‌యం తెలిసి.. ఆమె కు కొంత దూరం కూడా పెట్టారు. ఇక‌, ఆయ‌న‌పై ఫిర్యాదు చేసి.. ప‌ద‌విని వ‌దులుకునే వ‌ర‌కు పోరాడిన వారిలో సుంక‌ర కూడా ఉంటార‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతుంటారు. సో.. ఇలా.. టీడీపీతో ట‌చ్‌లోకి వెళ్ల‌డం.. వెంట‌నే సైలెంట్ అయిపోవ‌డం.. ష‌రా మామూలుగా మారింది.

సుంక‌ర‌కు టికెట్ ఇస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గన్న‌వ‌రం గెల‌చుకోవ‌చ్చ‌ని.. టీడీపీ నేత‌ల అంచ‌నా. ఇది కూడా నిజ‌మే కావొచ్చు. ఎందుకంటే.. ఆమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక‌, ఇప్పుడు ఈ చ‌ర్చ‌లు ఒక కొలిక్కి వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దీనికి కార‌ణం.. ఆమె ప‌ద‌విని ఆశిస్తున్నారు. మంత్రి ప‌దవి ఇస్తాన‌ని హామీ ఇస్తే.. పార్టీ మారుతాన‌ని ష‌ర‌తు పెట్టిన‌ట్టు టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. దీనికి చంద్ర‌బాబు సుముఖంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.