ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన భారీ కుంభకోణం ఇప్పుడు ప్రభుత్వంలో, అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ వాణిజ్య పన్నుల శాఖ అఫీషియల్ వైబ్సైట్కు సమాంతరంగా ప్రభుత్వ వైబ్సైటే అని అనుకునేలా మరో వెబ్సైట్ రూపొందించి కోట్ల కొద్దీ డబ్బును కాజేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
విశాఖపట్నంలో జీఎస్టీ జాయింట్ కమిషనర్ (ట్రైబ్యునల్) శ్రీనివాసరావుపై దీనికి సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. డిపార్ట్మెంట్లో అంతర్గతంగా జరిగిన విచారణలో మొత్తం వ్యవహారం బయటపడిందని చెప్తున్నారు. అయితే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ అధికారికి శ్రీకాకుళానికి చెందిని ఓ మంత్రి అండదండలు ఉన్నాయని.. ఆయన అండదండలతోనే ఈయన విశాఖలో పాతుకుపోయి అక్రమాలకు అలవాటుపడ్డారని విశాఖ వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
www.vsp.apgst.org పేరుతో అనధికారిక వెబ్సైట్ ఒకటి ఏర్పాటు చేసి.. అసలు వెబ్సైట్ తరహాలోనే దీన్ని రూపొందించారు. దీనికోసం 38 లాగిన్ ఐడీలు, పాస్ వర్డ్స్ క్రియేట్ చేసి అధికారుల లాగిన్ అవకాశం ఏర్పాటుచేశారు. గత రెండేళ్లలో వందలకొద్దీ దుకాణాలు, వ్యాపారసంస్థలకు దీన్నుంచి పన్ను ఎగవేత నోటీసులు జారీ చేసి కోట్లు వసూళ్లు చేశారు.
ఈ అనఫీషియల్ వెబ్ సైట్తో సాగించిన అక్రమాల వ్యవహారంలో 30 మందికి పైగా అధికారులు, సిబ్బందికి ప్రమేయం ఉన్నట్లు చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం నడిపించిన అధికారి 20 ఏళ్లుగా విశాఖపట్నంలోనే పాతుకుపోయి ఉన్నారని… శ్రీకాకుళానికి చెందిన ఓ మంత్రితో ఆయనకు మంచి సంబంధాలున్నాయని… ఎన్నికలప్పుడే కాకుండా సాధారణ కార్యక్రమాలకూ పెద్ద ఎత్తున డబ్బు సర్దుబాటు చేస్తుంటారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ అధికారికి సమీప బంధువు ఒకరు ఆ మంత్రి వెన్నంటే ఉంటుంటారని.. నిత్యం ఆయన పాల్గొనే కార్యక్రమాలలో పాల్గొంటుంటారని చెప్తున్నారు.
ఇప్పుడీ అధికారిని కాపాడేందుకు ఆ మంత్రి చక్రం తిప్పుతున్నారని టాక్. ఇన్వెస్టర్ల సదస్సు కోసం విశాఖ వచ్చిన సీఎం జగన్ వద్దకు ఈ వ్యవహారం తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి, సీఎం దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates