ఈ ‘తొంద‌ర’ కూడా ప్ర‌మాద‌మే జ‌గ‌న్ స‌ర్‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో సీఎం జ‌గ‌న్ తొంద‌ర చూస్తే.. ఇది మ‌రింత ఇబ్బందిగా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. న్యాయ‌వ్య‌వ‌స్థ ప‌రిశీల‌న‌లో ఉన్న విష‌యంపై జ‌గ‌న్ చాలా తొంద‌ర‌ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకు ఇంత తొంద‌ర అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుతం మూడు రాజ‌ధానులను ఏర్పాటు చేసేసి, ఈ నెల‌లో వ‌చ్చే నూతన తెలుగు సంవ‌త్స‌రాది నుంచి వాటిని లైన్‌లో పెట్టేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో ఉన్న మూడు రాజ‌ధానులు, అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంపై త్వ‌ర‌గా విచార‌ణ చేయాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ఇందులో రెండు ఉద్దేశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఒక‌టి.. ఈ నెల‌లో 14 వ తేదీన రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మేర‌కు మూడు రాజ‌ధానుల‌పై మ‌రోసారి చ‌ట్టాలు చేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం భావిస్తోంది.

అందుకే సుప్రీంలో ఏదో ఒక‌టి తేల్చేయాల‌ని కోరుతోంది. ఇది అయితే.. వెంట‌నే ఒక చ‌ట్టం చేసేసి.. ఆ వెంట‌నే రాజ‌ధానిని త‌ర‌లించేయాల‌ని చూస్తున్న‌ట్టు వైసీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. రెండోది.. రాజ‌ధానులు కాక‌పోయినా.. సీఎం కార్యాల‌యం అయినా.. త‌ర‌లించేయాల‌ని చూస్తోంది. కానీ, ఈ రెండు అంశాల‌కు కూడా సుప్రీం కోర్టు తీర్పు అత్యంత కీల‌కంగా మార‌నుంది.

అందుకే.. సుప్రీంకోర్టులో నిర్ణీత గ‌డువు విధించినా(ఈ నెల 28న విచారిస్తామ‌ని) కాదు, ముందుగానే విచారించాల‌ని.. ప‌ట్టుబ‌డుతోంది. కానీ, ఇలా తొంద‌ర ప‌డ‌డం వ‌ల్ల మొత్తానికే మోసం వ‌స్తుంద‌ని వైసీపీ నాయ‌కులే చ‌ర్చించుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. తొంద‌ర ప‌డుతున్నారంటే.. దీనివెనుక ఏదో జ‌రుగుతోంద‌ని.. సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డే అవ‌కాశం ఉంటుందని.. ఇదే జ‌రిగితే.. మ‌రింత జాప్యం జ‌రిగి.. ఎన్నిక‌ల స‌మ‌యానికి కూడా ఏదీ తేల‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు వైసీపీ నేత‌లు. మ‌రి జ‌గ‌న్ త‌న తొంద‌ర‌కు బ్రేకులు వేస్తారో లేదో చూడాలి.