టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల మృతి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. జనవరి 28న హఠాత్తుగా గుండెపోటుకు గురైన అర్జునుడు అప్పటి నుంచి విజయవాడ రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్జునుడిని బతికించేందుకు కొన్ని వారాలుగా నిపుణులైన వైద్యుల బృందం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం అర్జునుడు తుది శ్వాస విడిచారు.

జనవరి 28న హఠాత్తుగా గుండెపోటుకు గురైన అర్జునుడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే వైద్యులు అర్జునుడుకు స్టెంట్ అమర్చి ఐసియులో చికిత్స అందిస్తున్నారు. అయితే, అర్జునుడు రక్తపోటు అదుపులోకి రాకపోవడంతో ఆయన పరిస్థితి విషమించి ఈ రోజు సాయంత్రం మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అర్జునుడు మృతిపట్ల టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు.

టీడీపీ సీనియర్ నేతగా పేరుపొందిన అర్జునుడు ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. మచిలీపట్నానికి చెందిన అర్జునుడు 1995 నుండి 2000 వరకు ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2000 నుండి 2005 వరకు మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014లో కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత టీడీపీ కేంద్ర కమిటీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు. 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అర్జునుడు ఎంపికయ్యారు.