తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సోషల్ మీడియాలో చాలా మంచి ఫాలోయింగే ఉంది. అక్కడ ఆయనకు రోజూ బోలెడన్ని కంప్లైంట్లు, రిక్వెస్ట్‌లు వస్తుంటాయి. సోషల్ మీడియాలో ఎవరో ఏదో అడిగితే ఏం చేస్తాం అనుకోకుండా.. అందులో వీలైనన్ని అడ్రస్ చేస్తుంటాడు కేటీఆర్. కొన్ని సమస్యల్ని నేరుగా పరిష్కరించే ఆయన.. కొన్నింటిని సంబంధిత అధికారుల దృష్టికి తెస్తుంటాడు.
ఇలా సోషల్ మీడియాలో విజ్ఞప్తులను పట్టించుకుని పరిష్కరించే రాజకీయ నాయకులు దేశంలో కొద్దిమందే ఉంటారు. కానీ యువతలో ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఇది మంచి అవకాశం అనే విషయాన్ని సంప్రదాయ రాజకీయ నాయకులు అర్థం చేసుకోరు. కానీ కేటీఆర్ మాత్రం ఇలాగే సోషల్ మీడియాలో హీరోగా మారారు. తాజాగా ఆయన ఒక వైద్యుడు చేసిన విజ్ఞప్తికి స్పందించి.. హైదరాబాద్‌లో సీపీఆర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి శభాష్ అనిపించుకున్నాడు.
హైదరాబాద్‌లో పేరున్న కార్డియాలజిస్టుల్లో డాక్టర్ ముఖర్జీ మదివాడ ఒకరు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ గుండె జబ్బులు, ఇతర వైద్య విషయాలపై చక్కటి వీడియోల ద్వారా జనాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తుంటారాయన. ఐతే ఇటీవల వయసుతో సంబంధం లేకుండా చాలామంది హఠాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు వదులుతున్న కేసులు బాగా పెరిగిపోయిన నేపథ్యంలో ఆయన కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఒక సూచన చేశారు. హైదరాబాద్ గొప్ప సిటీ అని, ప్రపంచ స్థాయికి ఎదుగుతోందని.. ఐతే సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో సీపీఆర్ మీద నగర పౌరుల్లో, ప్రభుత్వ సిబ్బందిలో అవగాహన పెంచాల్సిన అవసరముందని.. ఇందుకోసం సీపీఆర్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు పబ్లిక్ ప్లేసుల్లో సీపీఆర్ కిట్లు, అత్యవసర మందులు అందించే డెఫిబ్రిలేటర్స్ ఏర్పాటు చేయాలని.. వరల్డ్ క్లాస్ సిటీస్ చాలా వాటిలో ఈ ఏర్పాట్లు ఉన్నాయని పేర్కొన్నారు.
దీనిపై గత నెల స్పందించి అలాగే చేద్దాం అని మాట ఇచ్చిన కేటీఆర్.. నెల తిరిగేలోపు పోలీసులు, ఇతర ప్రభుత్వ సిబ్బందికి సీపీఆర్ ట్రైనింగ్ ప్రోగ్సామ్స్ మొదలుపెట్టిన విషయాన్ని వెల్లడించారు. అంతే కాక డాక్టర్ సూచించిన డెఫిబ్రిలేటర్స్ 1400 ఆర్డర్ చేశామని.. త్వరలోనే వాటిని పబ్లిక్ ప్లేసుల్లో పెడతామని తెలిపారు. దీనిపై డాక్టర్ ముఖర్జీనే కాదు.. సోషల్ మీడియాలో అందరూ కేటీఆర్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. లీడర్ అంటే ఇలా ఉండాలని.. కేటీఆర్ చేతల మనిషి.. అందరు రాజకీయ నాయకులూ ఆయన్ని చూసి నేర్చుకోవాలని కొనియాడుతున్నారు.