విజయసాయిరెడ్డికి ప్రత్యామ్నాయం కావలెను

విజయసాయిరెడ్డి… ఒకప్పుడు వైసీపీలో జగన్ తరువాత జగన్ అంత. కానీ, ఇప్పుడు ఆ స్థానం పోయింది. విజయసాయిరెడ్డిని విశాఖపట్నం నుంచి తప్పించారు.. విజయసాయిరెడ్డిని వైసీపీ సోషల్ మీడియా నుంచి తప్పించారు.. విజయసాయిరెడ్డిని అనుబంధ సంఘాల బాధ్యతల నుంచీ తప్పించారు.. ఇక ఉన్నది ఒకే ఒక పదవి. అది… వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత పదవి. ఆ పదవైనా ఉంచుతారా లేదా అన్నది ఇప్పడు వైసీపీలో హాట్ టాపిగ్గా మారింది.

కొద్దిరోజులుగా వైసీపీలో విజయసాయిరెడ్డి ప్రాముఖ్యత క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ విజయసాయిరెడ్డి మాట నెగ్గలేదు. ఆయనకు కావాల్సిన నేతలకు అవకాశం రాలేదు. గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా విజయసాయిరెడ్డి అనుగ్రహం కోసం ప్రయాసపడేవారు. కానీ, ఇప్పుడు సాయిరెడ్డిని కలవాలని తాపత్రయపడే నేతలు కానీ, సాయిరెడ్డిని ప్రసన్నం చేసుకుంటే చాలు పార్టీలో మనకు ఢోకా ఉండదు అనుకునే నేతలు కానీ పూర్తిగా తగ్గిపోయారని సమాచారం. ఇంకా చెప్పాలంటే సాయిరెడ్డి మనుషులని తెలిస్తే తమకు కూడా ఎక్కడ ఇబ్బంది వస్తుందో అన్న టెన్షన్‌తో ఆయనకు దూరంగా ఉంటున్నారట.

సాయిరెడ్డికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఆయన సొంత మీడియా పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేయడమేనని.. గతంలో తెలుగు మీడియాలో ఒక వెలుగువెలిగిన సీనియర్ జర్నలిస్ట్ సహకారంతో సాయిరెడ్డి టీవీ చానల్ పెట్టే ప్రయత్నాలలో ఉన్నట్లు చెప్తున్నారు. వైసీపీకి సొంత మీడియా సాక్షి ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డి తనకు సొంతంగా మీడియా ఉండాలని కోరుకోవడం జగన్‌కు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది.

గతంలో సాక్షి మీడియాను సజ్జల రామకృష్ణారెడ్డి తన చేతుల్లో ఉంచుకున్నప్పటికీ సోషల్ మీడియా విజయసాయిరెడ్డి చేతిలో ఉండేది. కానీ, సోషల్ మీడియా బాధ్యతలు కూడా సాయిరెడ్డి చేతి నుంచి తప్పించి సజ్జల కుమారుడికి అప్పగించడంతో అది కూడా విజయసాయిరెడ్డి చేజారింది. దీంతో సాక్షి మీడియా, వైసీపీ సోషల్ మీడియా రెండూ సజ్జల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. దీంతో విజయసాయిరెడ్డి వాయిస్‌లెస్‌గా మారారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఆలస్యం చేస్తే రాజకీయంగా దెబ్బయిపోతానన్న ఆందోళనతో విజయసాయిరెడ్డి సొంత మీడియా ఏర్పాటుకు ప్రయత్నాలు పెంచుతున్నారు. ఈ విషయాలన్నీ జగన్‌కు సజ్జల చేరవేయడంతో ఆయన సాయిరెడ్డిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి ప్రాధాన్యం తగ్గుతూ వచ్చిందని.. పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయన్ను తొలగించాలని కూడా భావించినా అక్కడ కేంద్రంతో మిగతా వైసీపీ ఎంపీలకు సరైన సంబంధాలు లేకపోవడంతో సాయిరెడ్డిపై ఇంకా ఆధారపడుతున్నందున ఆయన్ను కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. అయితే, ఎన్నికలకు కొద్దికాలమే ఉన్నందున ఆలోగా వేరేవారికి అవకాశం కల్పించే నెపంతో ఆ పదవి నుంచి కూడా సాయిరెడ్డిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీలో వినిపిస్తోంది.