ఫుల్ కాన్ఫిడెన్స్‌తో రాజాసింగ్

వివాదాస్పద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చే ఎన్నికల గురించి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతున్నారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ తనపై విధించిన బహిష్కరణ త్వరలో ఎత్తివేస్తుందని… బీజేపీ టికెట్‌తో మళ్లీ పోటీ చేస్తానని ఆయన అంటున్నారు. ఒకవేళ సస్పెన్షన్ ఎత్తివేయకుంటే పోటీలో ఉండనని, స్వతంత్రుడిగా పోటీ చేసే ఆలోచనే తనకు లేదని రాజాసింగ్ చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తాను పెద్ద అభిమానినన్న రాజాసింగ్.. పార్టీకి వ్యతిరేకంగా వెళ్లబోనన్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సహా అందరి ఆశీస్సులు తనకు ఉన్నట్టు తెలిపారు.

కాగా, రాజాసింగ్ గోషామహల్ నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. గతేడాది ఆయనను పార్టీ బహిష్కరించడంతో వచ్చే ఎన్నికల్లో గోషామహల్ బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వకపోవచ్చనే ఊహాగానాలతో పార్టీలో మరికొందరు నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం రాజాసింగ్‌పై పార్టీ బహిష్కరణతో పాటు కోర్టు నుంచి ఆంక్షలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఎక్కడా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకుండా తెలంగాణ హైకోర్టు ఇంతకుముందు ఆదేశాలిచ్చింది. దీంతో ఆయన తెలంగాణలో ఎలాంటి సభలు, సమావేశాలలో పాల్గొనడం లేదు. కానీ, ఇటీవల ఆయన మహారాష్ట్రలో ఆయన హిందూత్వ ర్యాలీలో పాల్గొన్నారు.

ర్యాలీలు, సభలలో పాల్గొనేందుకు ఆయనకు హైకోర్టు అనుమతి ఇస్తే పార్టీ ఆయనపై బహిష్కరణ ఎత్తేసే అవకాశం ఉంది. గోషా మహల్‌లో రాజాసింగ్ తిరుగులేని నేతగా ఎదగడంతో బీజేపీకి అక్కడ ప్రత్యామ్నాయం కూడా లేదు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇదే విషయంలో దిల్లీ పెద్దలకు ఇప్పటికే చెప్పారని.. త్వరలో ఆయనపై నిషేధం ఎత్తేస్తారని తెలుస్తోంది.