టీడీపీ టార్గెట్ ఏంటి? అంటే.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం. వైసీపీ నేతలను జైళ్లకు పంపించడం .. రాజధాని అమరావతిని నిర్మించడం…పార్టీని బలోపేతం చేసుకోవడం. ఇవే కనిపిస్తున్నాయి. ఇవే వినిపిస్తున్నాయి. అయితే.. అసలు టార్గెట్ వేరే ఉందని అంటున్నారు పార్టీ నేతలు. ‘టార్గెట్ 10 ఇయర్స్’ అని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్‌హాట్‌గా ఉంది.
వచ్చే ఎన్నికల్లో గెలుపుతోపాటు.. ఆపై ఎన్నికల్లోనూ విజయం దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఇదే టార్గెట్ 10 ఇయర్స్ అంటున్నారు. అయితే.. ఈ విషయాన్ని నిమ్మళంగా ..జనాల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారట . దీనికి కారణం ఏంటో తెలియదు కానీ.. నారా లోకేష్ మాత్రం తన యువగళం పాదయాత్రల్లో మాత్రం దీనిపై తరచుగా కామెంట్లు చేస్తున్నారు. పైకి టార్గెట్ 10 ఇయర్స్ అని నేరుగా చెప్పడం లేదు.
కానీ, “చంద్రబాబు పదేళ్ల పాటు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది” అని మాత్రం లోకేష్ వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. “జగన్ అండ్ కో ఈ రాష్ట్రంలో చేసిన విధ్వంసాన్ని సరిచేసేందుకు పదేళ్లు అయినా పడుతుంది” అని చెబుతున్నారు. అంటే.. మొత్తంగా ఏదో ఒక సందర్భాన్ని పెట్టుకుని లోకేష్ ‘పదేళ్ల’ జపం చేస్తున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా.. మరో కీలక స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు.
“రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాబోయే పదేళ్లలో పేదరికం అనేది లేకుండా చేస్తానని హామీ ఇస్తున్నా” అని చంద్రగిరిలో నిర్వహించిన యువగళం పాదయాత్రలో లోకేష్ వ్యాఖ్యానించారు. అంటే.. ఈ పదేళ్ల టార్గెట్‌ను నారా లోకేష్ చాలా వ్యూహాత్మకంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారా? అనే చర్చ సాగుతోంది. దీనిపై అనుకూల మీడియా ఇప్పుడిప్పుడే ఫోకస్ చేయడం ప్రారంభించింది. దీంతో రాబోయేరోజుల్లో టీడీపీ ‘టార్గెట్ 10’ నినాదం ఊపందుకోనుందన్న మాట.