ఇదేంది జ‌గ‌న‌న్నా… ప‌రువు పోలా?!

ఏపీ సీఎం జ‌గ‌న్ అంటే.. వైసీపీ నాయ‌కులు ఏం చెబుతారంటే.. ‘జ‌న‌నేత‌’ అని! అంతేకాదు.. ఆయ‌న 2019 ఎన్నిక‌ల‌కు ముందు చేసిన పాద‌యాత్ర‌లోనూ “జ‌న‌నేత జ‌గ‌న‌న్నా.. జ‌గ‌న‌న్నా.. జ‌న‌నేత‌” అనే పాట ఠారెత్తిపోయింది. ఊరూవాడా.. ఈ పాట‌ను వైసీపీ నాయ‌కులు హోరెత్తించారు. మ‌రి అలాంటి జ‌న‌నేత స‌భ పెడితే..జ‌నాలుపోరిపోతున్నారు. పోనీ.. వీరిని క‌ట్ట‌డి చేద్దామ‌ని.. గేట్ల‌కు తాళాలు వేసినా.. పోలీసుల‌ను పెట్టి బెదిరించినా.. గోడ‌లు దూకి.. సందులు చూసుకుని మ‌రీ పారిపోతున్నారు.

గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో.. సీఎం జగన్‌ సభకు జనాన్ని భారీగా తరలించారు. వేమూరు, పొన్నూరు నియోజకవర్గాల్లోని పలుగ్రామాల నుంచి డ్వాక్రా మహిళల్ని బస్సుల్లో తరలించారు. ఉదయం 9 గంటలకల్లా ప్రాంగణంలోకి.. పంపించేశారు. పదిన్నర గంటల తర్వాత జగన్‌ సభాస్థలికి చేరుకున్నారు. 11 గంటల తర్వాత వేదికపైకి చేరుకున్నారు. ఉదయం 9గంటల్లోపే గ్యాలరీల్లోకి ప్రవేశించిన ప్రజలకు ఈలోగా ఓపిక నశించింది.

ఓవైపు ఎండ, మరోవైపు ఆకలికి తట్టుకోలేక బయటిదారి పట్టారు. ఆంక్షల పేరుతో చుక్కలు చూపించిన పోలీసులు సభకు వచ్చినవారితో.. ఓ రకమైన సర్కస్‌ ఫీట్లే చేయించారు. సీఎం వెళ్లేదాకా బయటకు పంపేది లేదంటూ గేట్లు మూసేశారు. ఎండకు, ఆకలికి ఉండలేని ప్రజలు సీఎం ప్రసంగిస్తుండగానే.. గోడలు దూకి వెళ్లిపోయారు. గేటువరకూ వచ్చిన ప్రజలను పోలీసులు బయటకు వెళ్లనీయలేదు. గేటుకు తాళాలు వేశారు. సీఎం వెళ్లాకే గేట్లు తెరుస్తామని.. ఈలోగా వెళ్లాలనుకుంటే చుట్టూ తిరిగి వెళ్లాలని తెగేసి చెప్పారు.

గేటువద్ద ఎంతసేపు వేచిచూసినా ఎవరినీ బయటకు పంపలేదు. 40 ఏళ్లు దాటిన వారిపైనా దయ తలవలేదు. ఎంతకీ గేట్లు తెరవకపోవడంతో.. అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నతమ్ముళ్లు ఒకింత సర్కస్‌ ఫీట్లు చేయాల్సి వచ్చింది. బారికేడ్ల లోపలి నుంచి దూరి బయటపడ్డారు. ప్రధాన గేటు తెరవకపోడంతో గోడ దూకారు. 40 నుంచి 50 ఏళ్ల వయస్కులు కూడా కష్టమైనా ఒకరినొకరు సాయం తీసుకుంటూ గోడ దూకారు. అలా ఒకరిద్దరు కాదు పెద్దసంఖ్యలో పరారయ్యారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి ముందే సభ కోసం వచ్చిన చాలా మంది ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఇదీ.. ఇప్పుడు జ‌న‌నేత గ్రాఫ్‌!! అంటున్నారు నెటిజ‌న్లు.