కొన్నాళ్ల కిందట ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని.. ఒక కామెంట్ చేశారు. “ఇక్కడ టీడీపీ ఎలా బతికి బట్టకడుతుందో చూస్తా” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజంగానే నాని.. టీడీపీపై విమర్శలు చేస్తారు కదా.. ఇది కూడా అందులో భాగమేనని అందరూ అనుకున్నారు. కానీ, తీరా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం టీడీపీకి కాక పుట్టిస్తున్నాయి.
ఇటీవలే ఇక్కడ ఇంచార్జ్‌గా రావి వెంకటేశ్వరరావును టీడీపీ అధినేత చంద్రబాబు నియమించారు. అయితే.. రావితో విభేదిస్తున్నవారు ఒక్కొక్కరుగా వివిధ కారణాలు చెబతూ.. పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా టిడిపి బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కీలక నేత దేవరపల్లి కోటి ప్రకటించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న బీసీ నేతగా పార్టీ ఉన్నతకి తన వంతు కృషి చేశానని పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు తప్పుకొంటున్నానని చెప్పారు.
పార్టీ కోసం పనిచేసే తన లాంటి బీసీ ,ఎస్సీ, మైనారిటీ నేతలను చిన్నచూపు చూస్తూ అవమానిస్తున్నారని కోటి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు ఇకనైనా కళ్ళు తెరిచి, షాడో వ్యవహార శైలికి చెక్ పెట్టాలని, లేనిపక్షంలో మంచి నాయకుడైన రావికి అందరూ దూరం అవుతారని కోటి అన్నారు. షాడో ఇంచార్జ్ అహంకారాన్ని నిరసిస్తూ తాను పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
వాస్తవానికి ఇది చిన్న విషయం. కానీ, పెద్దది చేశారు. దీంతో పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు పరిశీలకులు. నిజానికి వచ్చే ఎన్నికల్లో అయినా.. గుడివాడపై పట్టు బిగించాలని చంద్రబాబు నిర్ణయించుకుని ఆదిశగానే అడుగులు వేస్తున్నారు.కానీ, ఇప్పుడు ఇలా.. చోటా మోటా నేతలు దూరమైతే.. పార్టీకి ఇబ్బందేకదా.. అంటున్నారు పరిశీలకులు. దీనివెనుక ఎవరున్నారనేది పక్కన పెడితే.. ఇలాంటివాటిని ముందుగానే తెలుసుకోవాలి కదా.. అని వ్యాఖ్యానిస్తున్నారు.