ఏపీలో వైసీపీ ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో నవరత్నాలు
అనే కాన్సెప్టును తీసుకువచ్చింది. అంటే..తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. కీలకమైన 9 అంశాలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. వీటిలో అమ్మ ఒడి, రైత భరోసా, ఆరోగ్యశ్రీ, జగనన్న ఇళ్లు, విద్యాకానుక ఇలా.. 9 కార్యక్రమాలు ఉన్నాయి. వీటిని అమలు కూడా చేస్తున్నారు. ఇవి పాతవా. కొత్తవా.. అనే శషభిషలు పక్కన పెట్టి.. అమలు చేస్తున్నారు.
అంతేకాదు.. తరచుగా..నవరత్నాల పై ప్రచారం కూడా జోరుగా చేస్తున్నారు. సంక్షేమ ప్రభుత్వంలో నవ రత్నాలు.. అమలు చేస్తున్నామని నాయకులు.. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రచారం దంచి కొడుతున్నారు. అయితే.. ఇక్కడి తో కథ అయిపోలేదు. ఇప్పుడు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే, సీఎం జగన్ అంటే.. భారీ ఎత్తున అభిమానించే బియ్యపు మధుసూదన రెడ్డి మరో కొత్త ప్రయోగం కూడా చేశారు.
తమిళనాడును ఆనుకుని ఉన్న తన నియోజకవర్గంలోని ఓ గ్రామంలో రెండు సెంట్ల స్థలం కొని.. దానిలో ఏకంగా, నవరత్నాల గుడి
ని నిర్మించేశారు. జగన్ పై భక్తిని ఇలా ప్రదర్శించారన్నమాట. తమిళనాడులో ఒక సంప్రదాయం ఉంది. తమకు నచ్చిన, తాము మెచ్చిన నాయకులకు గుడులు కడతారు. ఇదే కాన్సెప్టును మధు కూడా తీసుకున్నట్టుగా ఉన్నారు.
వెంటనే ఆయన భారీ ఎత్తున ఇక్కడ ఆలయాన్ని కట్టించి.. దీనికి నవరత్నాల గుడి అని పేరు కూడా పెట్టారు. ఏదేమైనా..ఏదో ఒక రకంగా.. అధినేతను మచ్చిక చేసుకోవాలి కదా!! అందుకే ఈ ప్రయత్నాలు అంటున్నారు పరిశీలకులు. ఈ గుడిలో నవరత్న పథకాలను అన్నింటినీ.. చిత్రీకరించి.. ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం గమనార్హం.