జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ.. టికెట్లు అమ్ముకుంటోంది: నారా లోకేష్

వైసీపీ ఫైర్ బ్రాండ్‌, మంత్రి రోజాపై టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. స‌టైర్లు వేశారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా.. చంద్ర‌గిరిలో న‌డుస్తున్న నారా లోకేష్‌..జబర్దస్త్ ఆంటి అంటూ.. మంత్రి రోజాపై క‌మెంట్లు చేశారు. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మంత్రి నారాయణస్వామి తిరుమల దర్శనాల టికెట్లు అమ్ముకుంటున్నారన్నారు. దేశంలోని టీటీడీ ఆస్తుల్ని అమ్మేయాలని జగన్ కుట్ర చేశాడని, రోజా ఆంటీ.. కూడా టికెట్లు అమ్ముకుంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

చెవిరెడ్డి.. చెవిలో పువ్వు!!

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపైనా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెవిరెడ్డి.. చెవిలో పువ్వు అని కామెంట్ చేశారు. ఎమ్మెల్యేగా ఆయ‌న‌ దోచేది కొండంత.. చుట్టుప‌క్క‌ల ఉన్న‌వారికి ఇచ్చేది చెవిలో పువ్వంత అని విమర్శించారు. వెయ్యి రూపాయలు దోచుకుని.. పది రూపాయలు పంచుతున్నార‌ని విమ‌ర్శించారు. ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా, తుడా చైర్మన్‌గా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా నాలుగు పదవుల్లో ఉన్న చెవిరెడ్డి.. తను బాగుపడ్డాడు తప్ప చంద్రగిరి నియోజకవర్గానికి చేసింది ఏమీలేద‌న్నారు.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు రఘు ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ గోడ కట్టేస్తాడని.. స్థలం ఓనర్ అడిగితే భాగం అడుగుతాడని నారా లోకేష్ దుయ్య‌బ‌ట్టారు. 120 కోట్ల రూపాయలు విలువైన 60 ఎకరాల భూమి కొట్టేశాడన్నారు. చెరువుల భూమి కబ్జా చేసేశాడని.. తుడా అప్రూవల్ కు కప్పం కట్టాల్సిందేనన్నారు. రామచంద్రపురంలో రోజుకి 300 ట్రాక్టర్ల ఇసుక అక్రమ రవాణా అవుతుందని, దీని వెనుక చెవిరెడ్డి ఉన్నాడ‌ని చెప్పుకొచ్చారు. మొత్తానికి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌డం గ‌మ‌నార్హం.