పవన్, బాబు వ్యాఖ్యలు తప్పా?

ఇంతకుముందేమో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పుడేమో నారా చంద్రబాబు నాయుడు ఒకప్పటి తెలంగాణ ఆహారపు అలవాట్ల గురించి చేసిన వ్యాఖ్యల విషయంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. తెలంగాణను అవమానించారంటూ వీరి మీద ఇక్కడి వాళ్లు విరుచుకుపడుతున్నారు. గతంలో ఒక పొలిటికల్ మీటింగ్‌లో పవన్ మాట్లాడుతూ.. ప్రజా గాయకుడు గద్దర్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు.

సీనియర్ ఎన్టీఆర్‌ను ఇక్కడి జనాలు ఇప్పటికీ దేవుడిలా చూడడానికి కారణం చెబుతూ.. ఇక్కడ వరి పెద్దగా పండక జొన్నలు, రాగులు, సజ్జలు మాత్రమే తినే మెజారిటీ జనం ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడంతో తొలిసారి అన్నం తిన్నారని గద్దర్ తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణను, ఇక్కడి ప్రజలను కించపరిచేలా ఉన్నాయంటూ తెలంగాణ వాదులు అప్పట్లో పవన్ మీద విరుచుకుపడ్డారు.

కట్ చేస్తే తాజాగా ఒక కార్యక్రమంలో చంద్రబాబు సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆయన వేరొకరి వ్యాఖ్యలనేమీ ఉటంకించలేదు. ఎన్టీఆర్ వచ్చి 2 రూపాయలకే కిలో బియ్యం పథకం తెచ్చాకే ఇక్కడి జనంలో చాలామంది తొలిసారి అన్నం తిన్నారని.. అప్పటిదాకా జొన్నలు, సజ్జలు, రాగులే తినేవారని ఆయనన్నారు. దీంతో ఆయన మీద కూడా సోషల్ మీడియాలో తీవ్రమైన దాడి జరుగుతోంది. హైదరాబాద్‌ను తనే అభివృద్ధి చేసినట్లుగా బాబు చేసే వ్యాఖ్యల మీద కూడా తరచుగా ఇలాంటి దాడే జరుగుతుంటుంది.

ఐతే సున్నితమైన ఇలాంటి విషయాలను కొంచెం భిన్నమైన భాషలో, భిన్నమైన మార్గంలో చెప్పొచ్చు. ఇక్కడి జనాలు పూర్తిగా అన్నమే తినని స్థితిలో ఉన్నట్లు చెప్పకూడదు. అలాగే తనో, ఎన్టీఆరో మొత్తం మార్చేసినట్లుగా క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయకూడదన్నది వాస్తవమే. కానీ ఇక్కడ అప్పటి పరిస్థితులు తెలుసుకోకుండా దీన్ని తెలంగాణ మీద దాడిగా, ఇక్కడి ప్రజలను కించపరుస్తున్నట్లుగా భావించి ఎదురుదాడి చేయడం కరెక్టా అన్నది ప్రశ్న. 80వ దశకం నాటికి తెలంగాణలో నీటిపారుదల సౌకర్యం చాలా తక్కువ. ఇక్కడ వరి సాగు కూడా అందుకు తగ్గట్లే ఉండేది.

హైదరాబాద్ లాంటి సిటీలను పక్కన పెడితే.. గ్రామీణ ప్రాంతాల్లో బియ్యం లభ్యత, వాటిని కొనే స్థోమత తక్కువగా ఉండడం వల్ల అన్నం తినేవాళ్లు చాలా తక్కువగా ఉండేవారని.. వాళ్లందరికీ 2 రూపాయలకు కిలో బియ్యం పథకం ద్వారా రోజూ అన్నం తినే అవకాశం కల్పించింది ఎన్టీఆర్ ప్రభుత్వం వాస్తవం అన్నది తెలంగాణకు చెందిన అప్పటి జనాలే అంగీకరిస్తారు. డాక్టర్ జయరాం అనే ప్రొఫెసర్ స్వయంగా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు కూడా. అలాంటపుడు అప్పటి పరిస్థితులు తెలుసుకోకుండా తెలంగాణను కించపరిచినట్లు భావించి పవన్‌నో, చంద్రబాబునో తిట్టడం కరెక్టేనా అన్నది ప్రశ్న.