యువ‌గళానికి నెల పూర్తి.. ల‌క్ష్య సాధ‌న‌లో ఎంతెంత దూరం?

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన కీల‌క‌మైన పాద‌యాత్ర ‘యువ‌గ‌ళం’. దీనికి నెల రోజులు పూర్త‌య్యాయి. గ‌త జ‌న‌వ‌రి నెల 27వ తేదీన ప్రారంభించిన ఈ యువ‌గ‌ళం పాద‌యాత్ర ద్వారా.. 400 రోజుల పాటు 4 వేల‌కిలో మీట‌ర్ల దూరాన్ని ప‌ర్య‌టించి.. ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకోవాల‌నేది ల‌క్ష్యం. అంతేకాదు.. నాయ‌కుడిగా త‌న‌ను తాను నిల‌బెట్టుకునే ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నారు నారా లోకేష్‌.

మ‌రి ఈ నెల రోజుల కాలంలో.. ఆయ‌న ఏమేర‌కు ఈ ల‌క్ష్యాన్ని సాధించారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌. అన్నం మొత్తం ప‌ట్టుకుని చూడ‌న‌క్క‌ర్లేద‌న్న‌ట్టుగా.. జ‌ర‌గ‌బోయే యువ‌గ‌ళం ఎలా ఉంద‌నేది ఇప్పుడు జ‌రిగిన రోజుల‌ను బ‌ట్టి అంచ‌నా వేయొచ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వీరు చెబుత‌న్న‌ది ఏంటంటే..యువ‌గ‌ళం పేరు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వాన్ని తిట్టేందుకు మాత్ర‌మే ప్ర‌యోజ‌న‌క‌రంగా మార్చుకున్నార‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌.

యువ‌త‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం పెద్ద‌గా చేయడం లేద‌ని అంటున్నారు. పార్టీ ప‌రంగా చూసుకుంటే.. సీనియ‌ర్ల‌ను క‌ట్ట‌డి చేశారు. యువ‌త‌ను ఆక‌ర్షించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. కానీ.. అనుకున్న విధంగా అయితే.. యువ‌త‌ను ఆక‌ర్షించ‌లేక పోతున్నారు. దీనికి కార‌ణం.. నారా లోకేష్ ఆలోచ‌న‌లు.. వాద‌న‌.. వ్యాఖ్య‌లు అన్నీ కూడా.. ప్ర‌భుత్వంపైనే ఉన్నాయి. నిజానికి ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించేందుకు చంద్ర‌బాబు ఉన్నారు. ఇత‌ర పార్టీ నాయ‌కులు ఉన్నారు.

ఇక‌, ఇప్పుడు ప‌నిగ‌ట్టుకుని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వచ్చి.. కూడా జ‌గ‌న్‌పైనే విమ‌ర్శ‌లు చేస్తే.. బోర్ కొడుతోంద‌నేది ప‌రిశీల‌కుల మాట‌. ఇక‌, యువ‌త‌ను ఆకట్టుకునేందుకు ప్ర‌త్యేకంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మం కాబ‌ట్టి ఆదిశ‌గా ఏం చేస్తే బాగుంటుంద‌నేది ఆలోచించాల‌ని కోరుతున్నారు. యువ‌త సెంట్రిక్‌గా ప‌ద‌వులు ఇస్తామ‌ని..కానీ, రాజ‌కీయాల‌వైపు రావాల‌ని కానీ.. పిలుపునివ్వ‌డం.. వారి చ‌ద‌వులు, ఉద్యోగాలు, ఉపాధికిభ‌రోసా ఇస్తామ‌నే ప్ర‌క‌ట‌న‌లు కానీ.. ప‌దే పదే చేయాల‌ని కోరుతున్నారు. మ‌రి లోకేష్ ఏం చేస్తారో చూడాలి.