“వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలి. పోటీ ఎంత ఉంటుంది.. ఎలా ఉంటుంది.. ఎవరెవరు చేతులు కలుపుతారు ..ఎవరెవరు ఎలా ముందుకు వస్తారు? అనేది అనవసరం. మనం మాత్రం గెలిచి తీరాలి. వైనాట్ 175”- ఇదీ తరచుగా సీఎం జగన్ తన పార్టీ నాయకులు..మంత్రులు.. మేధావులు.. ఇతర నాయకత్వానికి కూడా చెబుతున్నమాట. ఈ క్రమంలోనే వ్యూహాలపై వ్యూహాలు అల్లుతున్నారు. ఐడియాలపై ఐడియాలు వేస్తున్నారు.
వలంటీర్ వ్యవస్థ ద్వారా తనకు అనుకూలంగా వ్యవహారాలు నడుపుతున్నారనే విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులను ఇంటింటి బాటపట్టించారు. అసలు నియోజకవర్గం మొహం చూడని నాయకులను కూడా నియోజకవర్గం బాటపట్టించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.
ఇక, గృహసారథులు అనే మరో కాన్సెప్టును తీసుకువస్తున్నారు. మార్చిలో ఉగాది రోజు నుంచి కూడా.. వీరు ఇంటింటికీ తిరుగుతారు. ప్రజలకు చేరువ అవుతారు. మరోవైపు.. సర్వేలపై సర్వేలు చేయిస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నారు. ఇవన్నీ.. ఇప్పటి వరకు అమలు చేసిన కార్యక్రమాలు. ఇక, ఇప్పటి వరకు సీఎం జగన్ గడపగడప దాటలేదు.. అనే వారికి భారీ షాక్ ఇస్తూ.. ఇప్పుడు జగన్ బయటకు వస్తున్నారు.
అదే ‘పల్లెనిద్ర’. ఇప్పటి వరకు నాయకులకు, అధికారులకు మాత్రమే పరిమితమైన ఈ పల్లెనిద్రను ఇక నుంచి సీఎం జగన్ కూడా చేయనున్నారు. ఆయన ఆధ్వరంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిని కూడా ఉగాది తర్వాత నుంచి ప్రతి వారం మూడురోజుల పాటు ఖచ్చితంగా.. పల్లెల్లో నిద్రించే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారు.
తద్వారా ప్రజలకు చేరువ కావడంతోపాటు.. ఆయా గ్రామా ల్లోని సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఉపయోగం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఎన్నికలే టార్గెట్‌గా జగన్‌తీసుకున్న ఈ నిర్ణయం సంచలనమనే చెప్పాలి. మరి ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.