జ‌న‌సేన స‌భ్య‌త్వం.. కొన్ని లుక‌లుక‌లు!!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని చెబుతున్న ప‌వ‌న్ సార‌థ్యంలోని జ‌న‌సేన పార్టీ.. మూడు అడు గులు ముందుకు.. నాలుగు అడుగులు వెన‌క్కి అన్న‌చందంగా మారిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. పార్టీ స‌భ్య‌త్వాన్ని ప్రారంభించి రెండు నెల‌లు గ‌డిచినా.. ప‌ట్టుమ‌ని 100 మంది కూడా చేరిన ప‌రిస్థితి లేదు. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు స‌భ్య‌త్వం పుంజుకోలేదు? అనే విష‌యం ఆస‌క్తిగా మారింది.

జ‌న‌సేన స‌భ్య‌త్వం పుంజుకోక‌పోవ‌డానికి ప్ర‌ధానంగా మూడు కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీ ల‌కులు. 1) స‌భ్య‌త్వ రుసుము ఎక్కువ‌గా ఉండ‌డం. 2) పార్టీ నేత‌లు విస్తృతంగా స‌భ్య‌త్వం కోసం ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డం. 3) ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి లేక‌పోవ‌డం. ఈ మూడు ప్ర‌ధాన కార‌ణాల‌తోనే పార్టీ వెనుక‌బ‌డి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం టీడీపీ అయినా.. వైసీపీ అయినా.. స‌భ్య‌త్వ రుసుమును రూ.100-200గా నిర్ణ‌యించాయి.

ఎవ‌రు ఎంత క‌ట్టినా.. చేర్చుకునేలా ఆదేశాలు ఉన్నాయి. కానీ, జ‌న‌సేన స‌భ్య‌త్వం విష‌యానికి వ‌స్తే మాత్రం రూ.500లుగా నిర్ణ‌యించారు. ఇది చాలా పెద్ద మొత్తం కావ‌డం గ‌మనార్హం. అయితే.. జ‌న‌సేన నేత‌లు చెబుతున్న‌ది ఏంటంటే.. రూ.500ల స‌భ్య‌త్వంతో వ్య‌క్తిగ‌త బీమా అందిస్తున్నామ‌ని చెబుతున్నా రు. కానీ, ఈబీమా టీడీపీ వైసీపీలు కూడా అందిస్తున్నాయి. దీంతో జ‌న‌సేన స‌భ్య‌త్వం ముందుకు సాగ‌డం లేదు.

ఇక‌, స‌భ్య‌త్వ న‌మోదు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని అటు ప‌వ‌న్ చెప్ప‌డం లేదు.. ఇటు క్షేత్ర‌స్థాయి లో నాయ‌కులు కూడా చొర‌వ చూప‌డం లేదు. దీంతో పార్టీలో చేరాల‌ని ఆకాంక్ష ఉన్న‌వారు కూడా వెనుక బ‌డి పోతున్నారు. మ‌రోవైపు.. ప్ర‌జ‌ల్లోనూ ఇప్పుడు ఆస‌క్తి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల వ‌ర‌కు అంటే మూడు మాసాల కింద‌టి వ‌ర‌కు కూడా టీడీపీ, బీజేపీలు స‌భ్య‌త్వ న‌మోదును చేప‌ట్టాయి. దీంతో ఇప్పుడు జ‌న‌సేన‌లోచేరేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌ని స‌మాచారం. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి.