టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, యువగళం జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. పుణ్యక్షేత్రం తిరుపతి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న లోకేష్ ను చూసేందుకు జనం భారీగా తరలి వస్తున్నారు. అన్ని వర్గాల వారితో లోకేష్ సమావేశమవుతూ.. వారి బాగోగులు తెలుసుకుంటున్నారు.టీడీపీ అధికారానికి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను అవినీతిని ఎండగడుతున్నారు. సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలని నినదిస్తూ ముందుకు సాగుతున్నారు.
పనిలో పనిగా లోకేష్ స్థానిక సమస్యలు కూడా ప్రస్తావిస్తున్నారు. నగరి యాత్రలో మంత్రి రోజాపై విమర్శలు సంధించారు. జబర్దస్ట్ ఆంటీ అంటూ కొత్త పేరు పెట్టేశారు. దానితో రోజా కాస్త గింజుకున్న మాట వాస్తవం. ఇప్పుడు తిరుపతి వచ్చే సరికి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేశారు.
ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి చీకటి దందాలతో తిరుపతి వాసులు విసిగిపోయారని లోకేష్ ఆరోపించారు. తండ్రి సాధు జీవిలా కనిపిస్తారని, కొడుకు వికృతజీవిగా మారిపోయారని ఆయన అన్నారు. తండ్రి కరుణాకర్ రెడ్డి మద్యం తాగొద్దని పైపైకి ప్రచారం చేస్తారని, తనయుడు అభినయ్ రెడ్డి లిక్కర్ సిండికేట్ నడుపుతారని లోకేష్ వెల్లడించారు.
ఇక అభినయ్ రెడ్డి గురించి లోకేష్ చాలా మాటలే చెప్పారు. తండ్రి కరుణాకర్ రెడ్డి నియోజకవర్గంలో అసలు గంజాయే లేదని చెబుతారని, కొడుకు అభినయ్ మాత్రం గంజాయి స్మగ్లింగ్ లో ఆరితేరారని లోకేష్ అంటున్నారు. బెదిరింపులు, వసూళ్లకు తనయుడు కేరాఫ్ అడ్రెస్ గా మారరన్నారు.
భూముల రిజిస్ట్రేషన్ లో కూడా అభినయ్ రెడ్డి దందా నడుపుతున్నారని లోకేష్ వెల్లడించారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అభినయ్ రెడ్డి తన మనుషులను కూర్చోబెట్టారన్నారు. వారంతా అతని చిన్ననాటి స్నేహితులన్నారు. అభినయ్ అడిగిన డబ్బులు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నారన్నారు. అలా 2,300 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినట్లు లోకేష్ లెక్కతేల్చారు. వైసీపీ నేతలు మేక వన్నె పులుల్లా తయారై తెలుగు ప్రజలను దోచుకుంటున్నారు..