మంత్రి వర్సెస్ ఎంపీ, మధ్యలో కాబోయే ఎమ్మెల్సీ

ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కీలక నియోజకవర్గం చిలకలూరిపేట ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఎన్నికలకు ముందు మంత్రిగా టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఒక వెలుగు వెలగి.. పేటను జనంలో వార్తగా కొనసాగించారు. ఎన్నికల్లో విడదల రజనీ వైసీపీ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. ముందు ఆమెకు ఎలాంటి పదవి రాకపోయినా పునర్ వ్యవస్థీకరణలో రజనీ మంత్రి పదవి పొందారు. పదవి వచ్చిన సంతోషంలో ఉబ్బితబ్బిబవుతున్న రజనీకి ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. పేటలో సవాల్ అని మరో వైసీపీ నేత అంటున్నారు.

చిలకలూరిపేటలో రజనీకి తాజాగా మర్రి రాజశేఖర్ తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మంత్రి పదవిని ఆశిస్తున్న ఆయన రజనీకి ఎర్త్ పెడతారన్న ప్రచారం మొదలైంది. నిజానికి వైసీపీ రాజకీయాల్లో తొలుత వెనుకబడి పోయిన మర్రి రాజశేఖర్ ఇకపై స్పీడ్ పెంచుతారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో రజనీకి టికెట్ ఇస్తున్నప్పడు రాజశేఖర్‌కు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీని చేస్తానన్నారు. అయితే దాదాపు నాలుగేళ్లు నిరీక్షించి, నిరాశ చెందిన రాజశేఖర్‌కు ఇటీవలే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో ఇక పేట రాజకీయాలు మారిపోయాయంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఆయన ఎమ్మెల్సీ కాబోతున్నారు..

రజనీకి ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఇబ్బందులు రావచ్చు. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా ఆమెపై కారాలు మిరియాలు నూరుతున్నారు. రజనీని దించాలని మర్రి రాజశేఖర్ కంటే కృష్ణదేవరాయలే ఎక్కువ పట్టుదలగా ఉన్నట్లు చెబుతున్నారు. రజనీ వర్గం తనపై లేనిపోని మాటలు తాడేపల్లి ప్యాలెస్‌కు చేరవేసిందని ఎంపీ ఆగ్రహంతో ఉన్నారు. ఆ తర్వాతే జగన్ తనను దూరం పెట్టారని ఆయన భావిస్తున్నారు. అందుకే ఇప్పుడాయన మర్రికి కొమ్ము కాస్తున్నట్లు తెలుస్తోంది. రజనీని దించి మంత్రి పదవిలో మర్రి రాజశేఖర్‌ను కూర్చోబెడితే తన పగ చల్లారుతుందని కృష్ణదేవరాయలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆయనకు అంత సమర్థత ఉందా అన్నదే పెద్ద ప్రశ్న..

నరసరావుపేట ఎంపీ ఆలోచనలో మాత్రం ఒక విషయం ఉంది. మర్రికి ఎలాగూ మంత్రి పదవిని గతంలోనే ఆఫరిచ్చినందున.. ఆ దిశగా నరుక్కుంటూ వస్తే రజనీని దించే వీలుంటుందని చెబుతున్నారు. ఎందుకంటే చిలకలూరి పేటలో రజనీ వర్గం బాగా బలపడింది. ఇప్పుడే దెబ్బ కొట్టకపోతే వచ్చే ఎన్నికల నాటకి ఏకు మేకై కూర్చుంటుంది. పైగా చిలకలూరిపేటలో రజనీ ప్రత్యర్థి వర్గం బలపడితే లోక్ సభ ఎన్నికల్లో తనకు కూడా ప్రయోజనంగా ఉంటుందని కృష్ణదేవరాయలు అంచనా వేసుకుంటున్నారు. మరి ఆయన అనుకున్నది జరుగుతుందో లేదో చూడాలి..