రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు.. మరో రెండు నెలల వరకు ఇలానే ఉంటాయా ? అప్పటికి ఉన్న పరిస్థి తులను గమనించి.. జనసేన దూకుడు పెంచుతుందా? అంటే..ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం వారాహి బస్సు ను రెడీ చేసినప్పటికీ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దానిని ఇంకా రోడ్డెక్కించలేదు. ఆయన ఎప్పుడు వస్తారా ? ఎప్పుడు యాత్ర ప్రారంభిస్తారా ? అని పార్టీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అయితే.. ఇప్పటికిప్పుడు వచ్చే ఉద్దేశం లేదని..జనసేన అంతర్గత చర్చల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి కారణం.. ముందుగానే పవన్ స్పందిస్తే.. ఎన్నికల నాటికి ఆయా అంశాలను వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని జనసేన నేతలు అంచనా వేస్తున్నారు. అదేసమయంలో ఇప్పటి నుంచి యాత్ర చేసినా.. వచ్చే ఎన్నికల వరకు ఆ వేడి కొనసాగుతుందనే భావన కూడా లేదు.
అందుకే.. ఆచి తూచి ఖచ్చితంగా ఎన్నికలకు ఆరు మాసాలు లేదా 8 మాసాల ముందు పవన్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సినిమా షెడ్యూళ్లు కూడా ఇదే విధంగా ఉన్నట్టు జనసేన వర్గాల్లో చర్చసాగుతోంది. వచ్చే ఎన్నికలకు ముందు 8 మాసాలు ఫ్రీ అవుతారని.. అప్పుడు ప్రజల్లో పూర్తి స్థాయిలో ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. దీనిని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు.
ఇలా వచ్చి పోవడం వల్ల కంటే.. పూర్తిగా కొన్ని నెలల పాటు ఏపీలోనే ఉంటే ఆప్రభావం ఎన్నికలపై ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. అదే సమయంలో వచ్చే రెండు మాసాల్లో పూర్తిగా పార్టీ సభ్యత్వాన్ని పూర్తి చేసి.. రంగంలోకి దిగితే.. అప్పుడు పార్టీపరంగా కూడా సైన్యం రెడీ అవుతుందని మరో అంచనా వేసుకుంటున్నారు. ఇలా.. ఏవిధంగా చూసుకున్నా.. వచ్చే రెండు మూడు నెలల వరకు కూడా.. జనసేన దూకుడు పెద్దగా ఉండదని..తర్వాత.. ఆపడం కూడా కష్టమేనని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates