కేసీఆర్ డిఫెన్సులో పడేలా ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

రాజకీయ ప్రత్యర్థులపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దాడి ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటలు మంత్రాల మాదిరిగా మారటమే కాదు.. అప్పటివరకు ఉన్న ఆలోచనల్ని మర్చేలా చేస్తుంటాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలోని వార్డుల్లోకి వర్షపు నీరుతో పాటు.. మురుగు నీరు చేరటం.. సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో హల్ చేసిన ఈ వైనంతో కేసీఆర్ సర్కారుకు తలనొప్పిగా మారింది.

ఉస్మానియా ఆసుపత్రిలోకి వర్షపు నీరు చేరిన వైనంపై సోషల్ మీడియాలో పోస్టు అయిన వీడియోలన్ని కేసీఆర్ మీద వ్యతిరేకతను పెంచేలా చేస్తే.. ఆయన నోటి నుంచి వచ్చిన ఒక్క మాట ఆ ప్రభావాన్ని సగానికి పైనే తగ్గించేసింది. అంతలా కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు.. తాను ఉస్మానియాను కూల్చేసి.. కొత్త భవనాన్ని కడతానంటే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని పేర్కొన్నారు.

తన తప్పేమీ లేదని.. ఉస్మానియాలో వర్షపు నీరు పాపమంతా ప్రతిపక్షాలదేనని ఆయన మండిపడ్డారు. దీంతో.. అప్పటివరకు కేసీఆర్ ను వేలెత్తి చూపినోళ్లు.. నిజమేనా? అన్న సందేహానికి గురయ్యారు.

ఇలాంటివేళ.. తాము అనని మాటల్ని అన్నట్లుగా ప్రచారం చేస్తున్న సీఎం కేసీఆర్ పై తీవ్రంగా మండిపడుతున్నారు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ నేతలతో కలిసి ఉస్మానియాను సందర్శించిన ఆయన.. వర్షం కారణంగా ఉస్మానియా ఆసుపత్రిలోకి నీళ్లు ఎందుకు వచ్చాయో తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కారు కొత్త భవనాలు కడతామంటే తాము అడ్డు చెప్పలేదని.. కాకుంటే ఇప్పుడున్న చోట కాకుండా కొత్త చోట ఉస్మానియా ఆసుపత్రుల్ని నిర్మించాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవనాలకు చేపట్టాల్సిన రిపేర్ల కోసం టీఆర్ఎస్ సర్కారు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు. చారిత్రక భవనాల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.

నిజాం హయాంలో అద్భుతమైన భవనాల్ని నిర్మించారని.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ సర్కారు మాత్రం రూపాయి ఖర్చు చేయలేదన్నారు. నిజాం నిర్మించిన భవనాల్ని కూల్చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలన్నారు. చారిత్రక భవనాల్నిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని.. ఖాళీగా ఉన్న ఆరు ఎకరాల్లో కొత్త భవనాల్ని నిర్మించాలని కోరారు.

సచివాలయం కోసం కొత్త భవనాల్ని నిర్మిస్తూ ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారని.. కరోనా వ్యాప్తిలో కేసీఆర్ సర్కారు ఫెయిల్ అయ్యిందన్నారు. ఇప్పటివరకూ కొత్త భవనాలకు విపక్షాలే అడ్డు అని చెప్పిన కేసీఆర్ తాజాగా ఉత్తమ్ చేసిన విస్పష్టమైన వ్యాఖ్యల నేపథ్యంలో ఎలా రియాక్టు అవుతారన్నది ఆసక్తికర అంశం. మరి.. దీనికి కేసీఆర్ సారు ఎలాంటి మేజిక్ చేస్తారో?