ఏపీ సీఎం జగన్ ‘మత్తు’ వదిలించాల్సిందేనా? ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు.. రాష్ట్రంలో మద్య నియంత్రణ చర్యలకు దిగాల్సిందేనా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రజలు మద్యాన్ని కోరుకునే వారు తగ్గుతున్నారు. తాజాగా జాతీయ స్థాయి నివేదికలు కూడా ఇదే చెబుతున్నాయి. జగన్ హామీ ఇచ్చి అమలు చేయని వాటిలో రెండు ప్రధానమైనవి ఉన్నాయి. ఒకటి సీపీఎస్ రద్దు. రెండు మద్యనిషేధం.
అయితే..ఈ రెండు కూడా ఇప్పుడు జగన్ పక్కన పెట్టేశారు. కానీ, దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలను పరిశీలిస్తే.. మాత్రం.. అనేక రాష్ట్రాల్లో హామీలు ఇవ్వకపోయినా.. మద్య నియంత్రణ, నిషేధాలకు పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం గత ఎన్నికల సమయంలో జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. విడతల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు పెంచడమే తప్ప తగ్గించింది ఎక్కడా కనిపించలేదు.
ఇదే విషయం.. జాతీయ మీడియా ప్రస్తావించింది. “ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా.. కీలకమైన మద్య నిషేధాన్ని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా మద్యం ధరలపై మండిపడుతున్నారు” అని తాజాగా జాతీయ పత్రిక ఒకటి గణాంకాలతో సహా ప్రచురించింది. దీని అర్ధం వచ్చే ఎన్నికల్లో మద్యం ప్రభావం.. ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అయితే.. ఇక్కడ చిత్రమైన విషయం కూడా ఉంది.
ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయాలని భావిస్తున్న టీడీపీ కానీ, జనసేన కానీ. మద్య నిషేధం విషయంలో మౌనంగా ఉన్నాయి. పైగా ఇటీవల చంద్రబాబు పలు సభల్లో తాము అధికారంలోకివస్తే.. నాణ్యమైన మద్యాన్ని విక్రయిస్తామని.. ధరలు తగ్గిస్తామని కూడా హామీ ఇచ్చారు. అంటే.. మద్య నిషేధం చేయరన్న మాట. ఇక, జనసేన అధినేత అసలు ఏ విషయాన్ని ప్రస్తావించలేదు. ఈ పరిణామాలను బట్టి.. జగన్ తన నిర్ణయం.. హామీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates