31 మంది ఎంపీలు.. ఒక్కటంటే ఒక్క అవార్డు కొట్ట‌లేక పోయారే!

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి 22 మంది లోక్‌స‌భ స‌భ్యులు 9 మంది రాజ్య‌స‌భ స‌భ్యులు ఉన్నారు. అంటే.. మొత్తంగా 31 మంది ఎంపీలు ఉన్నారు. అయితే.. వీరిలో ఎంత మంది ఆయా చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్తున్నారు? ఎంత‌మంది.. ఉత్త‌మ ఎంపీలుగా ప‌నిచేస్తున్నారు? ఎంత మంది ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌శ్నిస్తున్నారు? అంటే.. జీరో అనే స‌మాధాన‌మే వ‌స్తోంది. తాజాగా పార్ల‌మెంటు స‌చివాల‌యం.. ఉత్త‌మ ఎంపీల‌కు సంస‌ద్ ర‌త్న‌ అవార్డులు ప్ర‌క‌టించింది.

అయితే.. అవార్డుల్లో ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా వైసీపీ ఎంపీలు అవార్డులు తెచ్చుకోలేక పోయారు. చిన్న చిన్న‌రాష్ట్రాల‌కు చెందిన వారు ఈ జాబితాలో ఉండ‌డాన్ని చూస్తే.. ఏపీ వంటి రాష్ట్రంలో ఎందుకు ఈ కొర‌త ఏర్ప‌డింద‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. మ‌రి తాజాగా పార్ల‌మెంటు ప్ర‌క‌టించిన జాబితాలో ఎవ‌రెవ‌రు ఉన్నారంటే.. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధురి, రాజ్యసభ సభ్యులు మనోజ్‌ ఝా(ఆర్‌జేడీ-బిహార్‌), జాన్‌ బ్రిటాస్‌ (సీపీఎం) సహా 13 మంది ఎంపీలు ‘సంసద్‌ రత్న (2023)’ అవార్డుకు ఎంపికయ్యారు.

సంద‌స్ ర‌త్న అవార్డుకు ఎంపికైన వారిలో 8 మంది.. బిద్యుత్‌ బరన్‌ మహతో(జార్ఖండ్‌-ఏపీ క‌న్నా చిన్న రాష్ట్రం), సుకాంత మజుందార్‌(బెంగాల్‌), హీనా విజయకుమార్‌ గవిట్‌, గోపాల్‌ చిన్నయ్య శెట్టి (మహారాష్ట్ర), సుదీర్‌ గుప్తా (మధ్యప్రదేశ్‌)-బీజేపీ.. కుల్‌దీప్‌రాయ్‌ శర్మ (అండమాన్‌) కాంగ్రెస్‌.. అమోల్‌ రామ్‌సింగ్‌ కొల్హే-ఎన్‌సీపీ.. లోక్‌సభకు చెందినవారు ఉన్నారు.

ఐదుగురు సభ్యులు.. బ్రిటాస్‌, ఝా, ఫౌజియా తహసీన్‌ అహ్మద్‌ ఖాన్‌ (ఎన్‌సీపీ), విశ్వంభర్‌ ప్రసాద్‌ నిషాద్‌ (ఎస్‌పీ), ఛాయా వర్మ (కాంగ్రెస్‌) రాజ్యసభకు చెందినవారు ఉన్నారు. భారత రాజకీయాలకు, ప్రజలకు విశేష సేవలు అందించిన సీనియర్‌ నేతలను గౌరవించేందుకు ‘ది ఫౌండేషన్‌ అండ్‌ ప్రీసెన్స్‌’ గత ఏడాది డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డును నెలకొల్పింది. ఈ అవార్డుకు సీపీఎం మాజీ రాజ్యసభ సభ్యుడు టీకే రంగరాజన్‌ను జ్యూరీ ఎంపిక చేసింది. మార్చి 25న ఢిల్లీలో ఈ అవార్డులను అందజేస్తారు.

పార్లమెంటులో అద్భుత పనితీరు కనబరచిన పార్లమెంటేరియన్లను గౌరవించాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఇచ్చిన సలహాతో ‘ప్రైమ్‌ పాయింట్‌ ఫౌండేషన్‌’ 2010లో ‘సంసద్‌ రత్న’ అవార్డును నెలకొల్పింది.