మర్రి రాజశేఖర్‌కు మళ్లీ నిరాశేనా?

ఏపీలో, వైసీపీలో అత్యంత దురదృష్టవంతుడైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మర్రి రాజశేఖర్ అనే చెప్పుకోవాలి. చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్న మర్రి రాజశేఖర్ 2014లో చిలకలూరిపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లో మళ్లీ మర్రికే టికెట్ వస్తుందని అంతా అనుకున్నప్పటికీ విడదల రజిని ఒక్కసారిగా రేసులోకి వచ్చి టికెట్ ఎగరేసుకుపోయారు. ప్రత్తిపాటి పుల్లారావును ఆర్థికంగా ఎదుర్కోలేరన్న కారణంతో మర్రికి టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో విడదల రజినికి టికెట్ ఇవ్వడం, ఆమె గెలవడం జరిగిపోయాయి.

అయితే, విడదల రజినికి టికెట్ ఇచ్చే సమయంలో ఎన్నికల తరువాత ఎమ్మెల్సీని చేస్తానని మర్రికి జగన్ హామీ ఇచ్చారు. అంతేకాదు… ఎన్నికల ప్రచార సభల్లోనూ జగన్ ఇదే విషయం చెబుతూ వచ్చారు. ఎమ్మెల్సీని చేయడమే కాదు మర్రి రాజశేఖర్‌ను మంత్రిని కూడా చేస్తానని చెప్పారు. కానీ, ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు. సరికదా.. విడదల రజినిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

అనంతరం విడదల రజినిని మర్రిని ఏమాత్రం పట్టించుకోకుండా నియోజకవర్గంలో తన పెత్తనం సాగించడంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు మర్రి పక్షం వహించగా నియోజకవర్గంలో విడదల రజిని ఒక వర్గంగా… మర్రి రాజశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయులు మరో వర్గంగా నిత్యం నియోజకవర్గంలో రచ్చ నడిచేది.

కారణమేదైనా కానీ ఎన్నికల ముందు స్వయంగా జగన్ హామీ ఇచ్చినా కూడా మర్రికి ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. మర్రి రాజశేఖర్ సామాజికవర్గమైన కమ్మ కులానికే చెందిన తలశిల రఘురాం‌కు జగన్ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు కానీ మర్రికి మాత్రం మొండి చేయి చూపించారు.

ఇప్పుడు పెద్దసంఖ్యలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడం స్థానిక సంస్థలలో, అసెంబ్లీలో వైసీపీ బలం పుష్కలంగా ఉండడంతో వైసీపీలో ఈ పదవులకు డిమాండ్ ఏర్పడింది. జగన్ ఇచ్చిన మాట ప్రకారం మర్రికి ఎమ్మెల్సీ ఇస్తారన్న ఆశ ఆయన అనుచరులలో కనిపిస్తున్నప్పటికీ వైసీపీ పెద్దల లెక్కల మాత్రం వేరేగా ఉన్నాయని తెలుస్తోంది.

ముఖ్యంగా కీలకమైన గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో విభేదిస్తున్న దుట్టా రామచంద్రరావు, యార్లగడ్ల వెంకట్రావులను సంతృప్తిపరిచి వంశీకి వచ్చే ఎన్నికలలో ఇబ్బందులు లేకుండా చేయాలన్నది జగన్ యోచనగా తెలుస్తోంది. ఈ క్రమంలో యార్లగడ్డ వెంకటరావుకు ఎమ్మెల్సీ ఇస్తారని వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అదే నిజమైతే మర్రి రాజశేఖర్‌‌‌కు ఈసారి కూడా అవకాశం రానట్లే. యార్లగడ్డ, మర్రి ఇద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో యార్లగడ్డకు ఎమ్మెల్సీ ఇస్తే మరో కమ్మ నేతకు అవకాశం ఇవ్వడం కష్టమే. అంటే మర్రి రాజశేఖర్‌కు దారులు మూసుకుపోయినట్లే అవుతుంది.