గెలిచిన గల్లా.. ఏపీ నిర్ణ‌యంపై సుప్రీం కోర్టు స్టే

టీడీపీ ఎంపీ, ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గ‌ల్లా జ‌య‌దేవ్ న్యాయ పోరాటంలో ఒకింత తెరిపిన ప‌డ్డారు. చిత్తూరు శివారులోని గ‌ల్లా కుటుంబానికి చెందిన అమ‌ర‌రాజా బ్యాట‌రీస్ కంపెనీని మూసివేయాలంటూ.. ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన నోటీసులను సుప్రీం కోర్టు ప‌క్క‌న పెట్టింది. స‌ద‌రు నోటీసుల‌పై స్టే విధించింది. ఏపీ పీసీబీ షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టే ఎత్తేసిన సుప్రీంకోర్టు.. కంపెనీ మూసివేతపై హైకోర్టు స్టే ఆర్డర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో సుమారు ఏడాదికిపైగా న్యాయ పోరాటం చేసిన గ‌ల్లా ఒకింత విజ‌యం ద‌క్కించుకున్న‌ట్టు అయింది.

అస‌లు ఏం జ‌రిగిందంటే..

అమరరాజా కంపెనీ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని ఏపీ కాలుష్య‌నియంత్ర‌ణ మండలి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పరిసర జలాల్లో లెడ్ పెరుగుతోందని మూసియాల‌ని కోరింది. కాగా, రాజకీయ కారణాలతో తమను వేధిస్తున్నారని అమరరాజా గ్రూపు అధినేత‌గా గ‌ల్లా జ‌య‌దేవ్ కోర్టును ఆశ్ర‌యించారు. షోకాజ్ నోటీసుపై ప్రజాభిప్రాయ సేకరణ చేసి నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరారు. దీనికి కోర్టు స‌మ్మ‌తించింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఇచ్చే ఉత్తర్వులను 4 వారాలు నిలుపుదల చేయాలని సూచించింది. పీసీబీ నోటీసులపై న్యాయ పరిష్కారాల కోసం నిలుపుదల చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

అమరరాజా బ్యాటరీస్ కాలుష్యం వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ పీసీబీ షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టే ఎత్తేసిన సుప్రీంకోర్టు.. కంపెనీ మూసివేతపై హైకోర్టు స్టే ఆర్డర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇదిలావుంటే, ఏపీ ప్ర‌భుత్వం త‌మ‌ను ఏవిధంగా వేదిస్తున్న‌దీ అమ‌ర‌రాజా కంపెనీ సుప్రీంకోర్టులో ఏక‌రువు పెట్టింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తమ సంస్థకు ఇచ్చిన 253 ఎకరాల భూములను జ‌గ‌న్ ప్రభుత్వం 2020 జూన్‌ 30న వెనక్కి తీసేసుకుందని తెలిపారు.

ఈ కారణంతో అమరరాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించిన‌ట్టు చెప్పారు. ఒప్పందంలో పేర్కొన్న దానికంటే అధికంగా ఉపాధి కల్పించడమే గాక రూ.2,700కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టామని విన్నవించారు. ఆ తర్వాత ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు మరింతగా పెరిగాయని వివ‌రించారు. 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో విడతల వారీగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేశారని, గాలిలో, మట్టిలో సీసం పరిమాణం నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉన్నట్టు వెల్లడించారని కోర్టుకు వివ‌రించారు.

అంతేగాకుండా ఉద్యోగుల రక్తంలోనూ పరిమితికి మంచి సీసం ఉన్నట్టు పరీక్షల్లో తేలిందని చెప్పారు. నిబంధనలు పాటించడం లేదంటూ చిత్తూరు జిల్లా నూనెగుండ్లపల్లి, కరకంబాడిల్లో ఉన్న అమరరాజా బ్యాటరీ తయారీ యూనిట్లు మూసేయాలని పీసీబీ ఆదేశించింది. ఆ క్రమంలో 2021 మే 1న అమరరాజా బ్యాటరీస్‌ ఫ్యాక్టరీకి ఏకంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన‌ట్టు తెలిపారు.