ఆ నియోజ‌క‌వ‌ర్గాన్నిటీడీపీ రాసిపెట్టుకోవ‌చ్చు

రాష్ట్రంలోని ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కీల‌క‌మైంది.. పోల‌వ‌రం. మొత్తం 7 ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే.. వాటిలో దేనికీ లేని డిమాండ్ పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి ఉంది. దీనికి కార‌ణం.. కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మా ణం.. నిత్యం మీడియాలో ఉండే అవ‌కాశం.. అదేస‌మ‌యంలో కేంద్రం నుంచి అందుతున్న నిధులు. కారణం ఏదైనా.. పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం డిమాండే వేరు. అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కాల‌ని భావిస్తుంది.

ఇక‌, ఇప్పుడు ఇక్క‌డ గ‌త రెండు ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. 2014 లో టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. 2019లో వైసీపీ గెలుపుగుర్రం ఎక్కింది. ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? అంటే.. టీడీపీ ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. నాయ‌కులు దూకుడ‌గా ఉండ‌డం కాదు.. ఇక్క‌డ స‌మ‌స్య‌ల‌పై టీడీపీకి ఒక క్లారిటీ ఉండ‌డ‌మే. గ‌త 2014 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ముంపు మండ‌లాల‌ను ఏపీలో విలీనం చేయించ‌డంలో చంద్ర‌బాబు చొర‌వ తీసుకున్నారు.

ఇది క‌లిసి వ‌చ్చింది. దీంతో 2014లో ఇక్క‌డి గిరిజ‌నులు.. టీడీపీకి జై కొట్టారు. ఇక‌, త‌ర్వాత‌.. వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ ఇచ్చిన రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారంపై ఆశ‌లు పెట్టుకున్న గిరిజ‌నులు ఆ పార్టీకి జైకొట్టారు. అయితే.. వైసీపీ అధినేత ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డం..పోల‌వ‌రం పూర్తికాక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో ఇప్పుడు ఇక్క‌డి వారు మ‌రోసారి టీడీపీ వైపు చూస్తున్నారు. పైగా చంద్ర‌బాబు ఇక్క‌డ రెండు ప‌ర్యాయాలు ప‌ర్య‌టించారు.

దీంతో చంద్ర‌బాబుపై ఆశ‌లు పెరిగాయి. ఫ‌లితంగా సైకిల్ దూకుడు పెరుగుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే.. గెలుపు ఖాయ‌మే అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కుడు ఎవ‌ర‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌. గ‌తంలో 2014లో విజ‌యం ద‌క్కించుకున్న మొడియం శ్రీనివాస‌రావును నిల‌బెడితే.. వ‌చ్చే ఓటు కూడా పోతుంద‌ని స్థానిక నాయ‌కులు గుస‌గుసలాడుతున్నారు. కానీ, ఆయ‌నే పెద్ద ఎత్తున ఈ సీటు కోసం లాబీయింగ్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. సో.. ఈ విష‌యంలో చంద్ర‌బాబు ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాల‌నే ది త‌మ్ముళ్ల సూచ‌న‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.