సినీ నటుడు, ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు మహ్మద్ అలీకి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని .. గెలుపు గుర్రం ఎక్కి.. చట్ట సభల్లోకి ప్రవేశించాలని..చాలా ఉబలాటంగా ఉంది. దీనికి సంబంధించి ఖర్చు చేసేందుకు ఆయన ఏకంగా 10 కోట్ల రూపాయలు కూడా రెడీ చేసుకున్నట్టు ఆయనకు అనుకూలంగా ఉన్న వైసీపీ నాయకులు చెబుతున్నారు. కానీ, అలీ గెలుపు ఈజీనా? అంటే.. కాదనే సంకేతాలు వస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ పవనాలు వీయడం లేదు. ఇది ముమ్మాటికీ నిజం వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిలో మార్పు వస్తే.. ఫర్వాలేదు కానీ, ఇదే పరిస్థితి కొనసాగితే.. మాత్రం వైసీపీ తరపున ఎంత పెద్ద నేత పోటీ చేసినా గెలుపు గుర్రం ఎక్కడం అంత ఈజీకాదనే సంకేతాలు వస్తున్నాయి. అందుకే.. అలీ విషయంలోనూ ఇదే సూచనలు.. సంకేతాలు వినిపిస్తున్నాయి. అలీ నిజానికి మంచి పేరున్న నటుడే కావొచ్చు. కానీ, నటన పరంగా వేరు.. రాజకీయంగా వేరు. ఈ విషయంలో ఆయనకు క్లారిటీ ఉన్నా లేకున్నా.. ప్రజలకు మాత్రం ఉంది.
అందుకే అలీని గమనిస్తున్నవారు.. ఆయన గెలుపు అంత ఈజీ కాదని చెబుతున్నారు. ఆయన కోరుకుంటున్న రాజమండ్రి అయినా.. గుంటూరు ఈస్ట్ అయినా.. కర్నూలు నియోజకవర్గం అయినా.. లేక కడప నియోజకవర్గం అయినా.. ప్రజల మూడ్ మారిపోయిందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నాయకుల వ్యక్తిగత ప్రొఫైల్స్ కన్నా కూడా.. పార్టీల ప్రభావం జోరుగా పనిచేస్తుందనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. వైసీపీ తరపున పోటీ చేసేవారు కూడా ఇదే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
గత ఎన్నికలకు ముందు.. జగన్ అంటే ఒక ప్రభావం ఉండేది. ఇప్పుడు అదే జగన్ అంటే.. విఫలమైన నాయకుడిగా అందరూ చూస్తున్నారు. సంక్షేమ ఫలాలు అందుకుంటున్న 15 శాతం మంది ప్రజలను పక్కన పెడితే.. మిగిలిన వారికి జగన్పై ఇమేజ్ లేదు. ఆయనను కేవలం ‘బటన్నొక్కే సీఎం’గానే చూస్తున్నారు. దీంతో మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రభావం పార్టీపై పడుతుందనేది వాస్తవం. అందుకే..అలీ వంటి వారు పోటీ చేసినా.. ప్రయోజనం లేదని కుండబద్దలు కొట్టి చెబుతున్న వారు పెరుగుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates