ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం కైకలూరు. ఇటీవల కాలంలో ఈ నియోజకవర్గం రాజకీయంగా ప్రచారంలోకి వచ్చింది. దీనికి కారణం.. ఇక్కడ టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న జయమంగళ వెంకటరమణ అనూహ్యంగా వైసీపీలోకి జంప్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తారో లేదో .. అనే సందేహంతోనే తాను పార్టీ మారినట్టు ఆయన చెప్పారు. ఇక, ఈ పరిణామంతో టీడీపీకి ఇక్కడ నాయకుడు అవసరమయ్యారు. ఈ క్రమంలోనే కీలక నేత ఒకరు ఇక్కడ రెడీ అయ్యారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆయనే పిన్నమనేని వెంకటేశ్వరరావు.
టీడీపీ సీనియర్ నాయకుడిగా ఉన్న పిన్నమనేని కేడర్ కూడా ఇక్కడే ఉంది. గత 30 ఏళ్ళ నుంచి కూడా పిన్నమనేని కుటుంబం రాజకీయాల్లోనే ఉంది. రెండుసార్లు ముదినేపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు దాదాపు 30 ఏళ్ళ పాటు కృష్ణాజిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసి రాజకీయ దురంధరునిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కుమారుడు పిన్నమనేని వెంకటేశ్వరరావు కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఉమ్మడి ఆంధ్రలో మంత్రిగా, ఆప్కాబ్ చైర్మన్ గా కూడా పనిచేశారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు పెదనాన్న మనువడు పిన్నమనేని బాబ్జి కూడా గుడివాడ లేదా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో పిన్నమనేని కుటుంబం ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ముదినేపల్లి నియోజక వర్గం రద్దయింది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన జిల్లాల విభజనలో పిన్నమనేనికి కంచుకోటగా ఉన్న ముదినేపల్లి మండలాన్ని కైకలూరులో కలిపారు.
పిన్నమనేని సొంత మండలం నందివాడను గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కలపడం జరిగింది. కైకలూరు అసెంబ్లీ పరిధిలోని మండవల్లి లంక గ్రామాల్లో పిన్నమనేని కుటుంబానికి మంచి పట్టు కూడా ఉంది. కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ వైసీపీలో చేరిన నేపథ్యంలో టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం పిన్నమనేని కుటుంబం ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం. పిన్నమనేని కుటుంబానికి కైకలూరు టీడీపీ సీటును కేటాయిస్తే ఏలూరు, కృష్ణాజిల్లాల్లోని తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమవుతుందన్న సంకేతాలు కూడా ఉన్నాయి.
గత 20 ఏళ్ళుగా పిన్నమనేని కుటుంబం నామినేటెడ్ పదవులకే పరిమితం కావడంతో కొంత మంది నేతలు వివిధ పార్టీల్లోకి వెళ్ళిపోయారు. వారంతా ఇప్పుడు పిన్నమనేని గూటికి చేరే పనిలో నిమగ్నమై ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కైకలూరు నియోజకవర్గం టికెట్‌ను పిన్నమనేనికి కేటాయిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates