‘చంద్రబాబు, విజయసాయిరెడ్డి చేతిలో చేయి వేసి మాటామంతీ’

టీడీపీ అధినేత చంద్రబాబు పేరెత్తితే ఒంటి కాలు మీద లేస్తారు వైసీపీ నంబర్ 2 విజయసాయిరెడ్డి. చంద్రబాబు, తెలుగుదేశం నేతలు కూడా విజయసాయిరెడ్డిపై అంతే స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. ఈ ఇద్దరు నాయకులు కలిసిన సందర్భం, మాట్లాడుకున్న సందర్భం ఇంతవరకు ఎవరూ చూడలేదు. అలాంటిది నందమూరి తారకరత్న మృతి సందర్భంగా పరామర్శించేందుకు వచ్చిన ఈ ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. అంతేకాదు.. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.

కార్డియాక్ అరెస్ట్‌తో 23 రోజులుగా చికిత్స పొందుతూ మరణించిన నందమూరి తారకరత్న కొద్దికాలంగా టీడీపీలో యాక్టివ్‌గా తిరుగుతున్నారు. ఎన్టీఆర్‌కు స్వయాన మనవడు అయిన తారకరత్న చంద్రబాబుకు బావమరిది కుమారుడు అవుతారు. అదేసమయంలో ఆయనకు విజయసాయిరెడ్డి తో నూ దగ్గరి బంధుత్వం ఉంది. విజయసాయిరెడ్డి భార్య సోదరికి తారకరత్న అల్లుడు.

దీంతో తారకరత్న హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కూడా విజయసాయిరెడ్డి వెళ్లారు. అక్కడ తారకరత్న ఆరోగ్యం గురించి అంతా తానై చూసుకుంటున్న నందమూరి బాలకృష్ణతోనూ సాయిరెడ్డి మాట్లాడారు. అయితే, వైద్యుల ప్రయత్నాలేవీ ఫలించక తారకరత్న మరణించడంతో ఆయన మృతదేహాన్ని హైదరాబాద్‌లోని సొంతింటికి తెచ్చారు.

అక్కడ సినీ, రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధువులు తారకరత్న మృతదేహానికి నివాళులర్పించారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు, విజయసాయిరెడ్డి అక్కడకు వచ్చారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ఈ సందర్భంగా తారకరత్న కుమార్తెను విజయసాయిరెడ్డి చంద్రబాబుకు పరిచయం చేశారు. చంద్రబాబుతో విజయసాయిరెడ్డి చాలా సమయం మాట్లాడారు. ఇద్దరూ తారకరత్న గురించే మాట్లాడుకున్నారు. ఆయన వ్యక్తిత్వం, మంచితనం, కుటుంబం, పిల్లలు వంటి విషయాలన్నీ ఇద్దరూ మాట్లాడుకుని… తారకరత్న చనిపోవడం పై బాధపడ్డారు.

కాగా… తన సోదరుడి మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్‌తో, కల్యాణ్ రామ్‌లతోనూ విజయసాయిరెడ్డి మాట్లాడారు.