కొన్ని నెలల కిందట విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఏం జరిగిందో గుర్తుందా? విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఏదో సభ పెట్టిన సందర్భంలోనే పవన్ తన పర్యటన పెట్టుకున్నారు. చాలా రోజుల ముందే షెడ్యూల్ చేసుకున్న పార్టీ కార్యక్రమం అది. మామూలుగా అయితే పవన్ వచ్చేవాడు. ఆ కార్యక్రమం ఏదో పూర్తి చేసుకుని వెళ్లిపోయేవాడు. మీడియాలో ఓ మోస్తరుగా కవరేజీ వచ్చేదంతే. కానీ ఆయన పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంతో పవన్ పర్యటన మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కింది.
ఎయిర్ పోర్టు దగ్గర్నుంచి ప్రతి చోటా నిర్బంధానికి ప్రయత్నించడం.. పవన్ వచ్చే దారిలో కరెంటు తీసేయడం.. ఆయన్ని హోటల్లో హౌస్ అరెస్ట్ చేయడం లాంటి చర్యలతో మొత్తం మీడియా దృష్టంతా రెండు రోజులు ఆ వ్యవహారం మీదే ఉంది. సోషల్ మీడియా కూడా ఈ టాపిక్ మీదే హోరెత్తింది. రాష్ట ప్రజలంతా ఆ విషయమే చర్చించుకుంది. పవన్ మొత్తంగా ఆ వ్యవహారంలో హీరో అయ్యాడు. చివరికి జగన్ సర్కారు చర్యలన్నీ బూమరాంగ్ అయ్యాయని అర్థమైంది. ఆ ఉదంతం నుంచి జగన్ ప్రభుత్వం పాఠాలేమీ నేర్చుకున్నట్లుగా లేదు.
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌ల విషయంలోనూ ఇదే పద్ధతి అవలంభిస్తూ వాళ్లను హీరోలను చేసి, తమ పార్టీకి డ్యామేజ్ చేసుకునే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. లోకేష్ యువగళం కార్యక్రమం గురించి వైసీపీ నేతలు అవసరానికి మించి స్పందిస్తుండటం.. ఆ యాత్రకు అడ్డంకులు సృష్టించడం ద్వారా లోకేష్ హైలైట్ అవడానికి కారణమవుతోంది.
ఇక తాజాగా చంద్రబాబు అనపర్తి పర్యటన సందర్భంగా ప్రభుత్వం తీరు మరీ విడ్డూరంగా తయారైంది. అనుమతి తీసుకున్నా సరే బాబు వాహనాన్ని అడ్డగించడంతో ఆయన రాత్రి పూట 5 కిలోమీటర్లు నడుచుకుంటూ అనపర్తికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన అక్కడ మాట్లాడుతుంటే కరెంటు తీసేయగా.. జనమే సెల్ ఫోన్లతో వెలుగును ఇచ్చారు. బాబుకు అనుమతి ఇస్తే వాహనం మీద ఊరేగింపుగా వెళ్లిపోయేవారు. కానీ ఇలా కాలినడకన వెళ్లడంతో జనాల్లో సానుభూతి వచ్చింది. ఈ విషయం మీడియాలో హైలైట్ అయింది. సెల్ ఫోన్ లైట్ల మధ్య ఆయన మాట్లాడ్డం.. పోలీసులకు హెచ్చరికలు జారీ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఈ ఇష్యూలో బాబు హీరో అయ్యారు. బాగా హైలైట్ అయ్యారు. చూస్తుంటే.. ప్రతిపక్ష నేతలను హీరోలను చేయడమే పనిగా పెట్టుకున్నట్లుంది జగన్ ప్రభుత్వం.
Gulte Telugu Telugu Political and Movie News Updates