టీడీపీలోకి మ‌హాసేన రాజేష్ .. ఆ టికెట్ కోస‌మేనా?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌మ‌క్షంలో యూట్యూర్‌, విమ‌ర్శ‌కుడు.. మ‌హాసేన పేరుతో యూట్యూబ్ నిర్వ‌హి స్తున్న రాజేష్ టీడీపీ కండువా క‌ప్పుకొన్నారు. రాజేష్ త‌ర‌చుగా వైసీపీ విధానాల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. అనేక విధానాల‌ను, ముఖ్యంగా రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కారంటూ.. రాజేష్ చేసిన వీడియోల‌ను వీక్ష‌కులు బాగానే ఆద‌రించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌న‌సేన వైపు చూశారు. అయితే.. అటు వైపు నుంచి పెద్ద‌గా రియాక్ష‌న్ రాక‌పోవ‌డంతో టీడీపీ సైకిల్ ఎక్కారు.

ప్ర‌స్తుతం తూర్పుగోదావరి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు.. సామర్లకోటలో ఎస్సీ నేతలతో నిర్వహిం చిన సమావేశం అనంతరం.. రాజేష్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే.. గ‌తంలో చంద్ర‌బాబు ను రాజేష్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. ఆయ‌న త‌న కుమారుడిని ముఖ్య‌మంత్రి చేసుకునేందుకే ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ద‌ళిత ద్రోహి ఎవ‌రైనా ఉన్నారా? అంటే.. అది చంద్ర‌బాబేన‌ని ప్ర‌క‌టించారు. దీంతో అప్ప‌ట్లో తీవ్ర స్థాయిలో రాజేష్ వ్యాఖ్య‌లు ఎస్సీ వ‌ర్గాల్లోకి చేరుకున్నాయి.

ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన రాజేష్‌.. తాజాగా మాట్లాడుతూ.. 2019లో తప్పు చేయకుండా ఉండుంటే ఈపాటికే అమరావతి నిర్మాణం పూర్తయ్యేదని వెల్లడించారు. దళితులు ఎవరి కాళ్ల మీద వారు నిలబడేలా చంద్రబాబు చేశారని కొనియాడారు. చీకటి వచ్చాకే వెలుగు విలువ తెలుస్తుందని హితవు పలికారు. జగన్‌ తుగ్లక్‌ పాలన చూశాక.. చంద్రబాబు పాలన రామరాజ్యం అనే విషయం అర్థమవుతోందని మహాసేన రాజేష్‌ అన్నారు.

ఆ టికెట్ ఖాయ‌మేనా?

ఇక‌, ఊర‌క‌రారు మ‌హానుభావులు అన్న‌ట్టుగా ఎవ‌రు పార్టీ తీర్థం పుచ్చుకున్నా.. టికెట్ కోస‌మే క‌దా! ఇప్పు డు రాజేష్‌కు టికెట్ రెడీగా ఉంద‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. అదే ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ ర్గం.. అమ‌లాపురం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి రాజేష్ పోటీచేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. లోక్‌స‌భ మాజీ స్పీక‌ర్ బాల‌యోగి కుమారుడిని ఎంపీగా పంపించి.. రాజేష్‌కు ఈ టికెట్ ఇస్తార‌ని తెలుస్తోంది. వైసీపీ త‌ర‌ఫున మంత్రి పినిపే విశ్వ‌రూప్‌కే మ‌రోసారి టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంది.