తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం.. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం.. వంటి పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయి లో ఫైర్ అయ్యారు. ప్రభుత్వ విధానం, నిరంకుశ పోకడలను తెలియచేస్తోందన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా పర్యటనకు వెళ్లిన చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసులను రోడ్డుకు అడ్డంగా కూర్చోబెట్టడం ఏమిటని పవన్ ప్రశ్నించారు?
అంతేకాదు.. ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు రోడ్డుపై బైఠాయించడం చూస్తాంగానీ.. విధి నిర్వహణ లోని పోలీసులు రోడ్డు మీద కూర్చోవడం వైసీపీ పాలనలోనే చూస్తున్నామని పవన్ ఎద్దేవా చేశారు. ప్రజా స్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటివి భారత రాజ్యాంగం కల్పించిందని.. కనీసం ఈ విషయం కూడా పాలకులకు తెలియకపోవడం దారుణమని విమర్శించారు.
ప్రజాపక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని మూడు ముక్కల ముఖ్యమం త్రి భావిస్తున్నారా? అని నిలదీశారు. దేవీ చౌక్ వద్ద సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు తరువాత.. ఎందు కు వద్దన్నారో.. చెప్పాలన్నారు. అనపర్తిలో పోలీసుల ద్వారా చేయిస్తున్న చర్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని పవన్ విమర్శించారు.
నేనూ బాధితుడినే..
గతంలో తాను కూడా బాధితుడినేనని ఈ సందర్భంగా పవన్ చెప్పుకొచ్చారు. గతంలో జనవాణి కార్యక్రమం కోసం తాను విశాఖపట్నం వెళ్తే వీధి దీపాలు ఆర్పి వేసి, హోటల్ గదిలో ఏలా బంధించారో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందంటూ పవన్ ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates