జ‌న‌సేన‌కు అటూ ఇటూ ద‌బిడిదిబిడేనా…!


జ‌న‌సేన పార్టీకి సంక‌ట ప‌రిస్థితి వ‌చ్చింది. ఇప్పుడు ఔన‌న్నా..కాద‌న్నా..చిక్కుగానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ వేడి రాజుకుంది. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. ఈ ఎన్నిక‌ల‌ను మూడు ప్ర‌ధాన పార్టీలు కూడా సీరియ‌స్‌గానే తీసుకున్నాయి. బీజేపీ, వైసీపీ, టీడీపీలు.. ఎవ‌రికి వారే త‌మ త‌మ అభ్య‌ర్థును నిలబెట్టుకున్నారు.

ఇక‌, ఇక్క‌డ జ‌న‌సేన ప్ర‌యమేయం లేదు. మ‌రి అలాంట‌ప్పుడు సంక‌టం ఎందుకు? అనేది ప్ర‌శ్న‌. ఇక్క‌డే ఉంది అస‌లు ట్విస్టు. ప్ర‌స్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న జ‌న‌సేన‌కు.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న బీజేపీ కీల‌క నాయ‌కుడు ఒక‌రు ఫోన్ చేసి త‌మ‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాలని కోరార‌ట‌. ఎందుకంటే.. ఎలానూ పొత్తులో ఉన్నారు కాబ‌ట్టి.. ఉత్త‌రాంధ్ర‌లో బ‌లంగా ఎదుగుతున్నారు కాబ‌ట్టి..త‌మ‌కు అండ‌గా నిల‌వాల‌ని కూడా కోరుకున్నారు.

ఇక‌, మ‌రోవైపు.. టీడీపీ ఏకంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో పొత్తుకు సిద్ధ‌మ‌వుతోంది. పైగా.. ప్ర‌స్తుతం జ‌రు గుతున్న ఎన్నిక‌లు.. వైసీపీకి ప్ర‌జాబ‌లం లేద‌ని, ముఖ్యంగా ఉపాధ్యాయ‌, గ్రాడ్యుయేట్ వ‌ర్గాలు.. అయితే.. వైసీపీపై క‌న్రెర్ర‌తో ఉన్నాయ‌ని.. ఈ నేప‌థ్యంలో వైసీపీని ఓడించ‌డం ద్వారా.. సార్వ‌త్రిక స‌మ‌రంలో ఆ పార్టీ ఓటు బ్యాంకును బ‌ల‌హీన ప‌రిచి.. ప్ర‌జ‌ల్లో వైసీపీని డైల్యూట్ చేయాల‌నేది టీడీపీ ఎత్తుగ‌డ‌.

ఈ క్ర‌మంలో ఇప్పుడు జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను ప్ర‌ధాన స‌వాలుగా తీసుకుంది. అయితే.. బీజేపీ కూడా అంతే దూకుడుగా ఉండ‌డంతో ప‌వ‌న్ త‌మ‌కు సాయం చేయాల‌ని టీడీపీ వ‌ర్గాలు కోరుతున్నారు. పైకి ఏమీ బ‌హిరంగ ప్ర‌చారం చేయ‌క‌పోయినా.. అనుకూలంగా వ్యాఖ్య‌లు చేయాల‌నేది టీడీపీ వ‌ర్గాల ఆశ‌గా ఉంది. దీంతో జ‌న‌సేన ఇప్పుడు ఎటూ తేల్చుకోలేక‌పోతోంద‌ని అంటున్నారు. మ‌రి ఎన్నిక‌ల ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.