ఆయన ప్రవచన చక్రవర్తి. సరస్వతీ పుత్రులు.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వివాదాలకు కడు దూరం. ఆధ్యాత్మికం ఆయన మార్గం. ఆయనే చాగంటి కోటేశ్వరరావుగారు. ప్రస్తుతం ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కార్యక్రమాల సలహా దారుగా నియమించారు. ఆయన ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. ఆయనను సలహాదారుగా నియమించడం పట్ల ఎలాంటి సందేహాలు.. అవసరం లేదు. దీనిపై రగడ అంతకన్నా అవసరం లేదు. ఆయనకు ఆ అర్హత.. స్థాయి(అంతకుమించి) ఉన్నాయి.
అయితే.. ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం ఒక్కటే. అది కూడా ఆయనను తప్పుబట్టడం కాదు కానీ.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతోనే వచ్చిన చిక్కంతా! గతంలో చంద్రబాబు ప్రభుత్వంలోనూ.. చాగంటి వారిని సలహాదారుగా నియమించారు. అప్పట్లో విద్యాసంబంధ విషయాలపై సలహాదారుగా ఆయనను నియమించారు. మొదట్లో కాదన్నారు. తర్వాత.. ఆయనను కొందరు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేతలు ఒప్పించారని సమాచారం. దీంతో ఎట్టకేలకు ఒప్పుకొన్నారు.
అయితే.. ఈ సందర్భంగానే చాగంటివారిని కొందరు తూర్పు నేతలు.. సీఎం చంద్రబాబును కలిసేందుకు రావాలని ఆహ్వానించారు. వీరిలో అప్పటి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా ఉన్నారు. కానీ, చాగంటి వారు సున్నితంగా తిరస్కరించారు. “నేను ఆధ్యాత్మిక వాదిని. నాయకులతో కలిసి కరచాలనం చేస్తే.. బాగోదు” అని ముక్తసరిగా తిరస్కరించారు. ఇక, చంద్రబాబు ఆయనకు కల్పించిన భద్రతను కూడా వద్దన్నారనుకోండి. కానీ, బాబు మాత్రం పట్టుబట్టి..1+1 భద్రత కల్పించారు.
కట్ చేస్తే.. అలా చంద్రబాబును కలుసుకునేందుకు ఇష్టపడని చాగంటివారు.. తాజాగా సీఎం జగన్‌తో భేటీ కావడం.. ఆయన చేతుల మీదుగా శాలువా కప్పించుకుని.. బొకే అందుకోవడం ఆశ్చర్యంగాను.. విస్మయాత్మకంగానూ ఉన్నాయనేది పరిశీలకుల మాట. ఎవరూ తప్పుబట్టడం లేదు సుమా!! కానీ, ఎక్కడో ఎందుకో తేడా కొడుతోందని మాత్రం అంటున్నారు. అలాగని.. ఎవరూ విమర్శించే సాహసం చేయబోరు. కానీ.. నసుగుడు మాత్రం వినిపిస్తోంది. ఇక, సీఎం ఇంటికి వెళ్లిన.. చాగంటి వారు.. ఇంట్లోని గోశాలను పరిశీలించి.. ఆనందం వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates