ఏపీ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపీ సర్కార్ కు ఇప్పటికే పలు మార్లు చుక్కెదురైన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ పదవీ కాలం కుదింపు, కొత్త కమిషనర్గా జస్టిస్ కనగరాజు నియామకం కోసం జారీ చేసిన జీవో కొట్టివేత వంటి వ్యవహారాలతో జగన్ సర్కార్ హైకోర్టులో భంగపడింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ సుప్రీం కోర్టు తిరస్కరించింది. రమేష్ కుమార్ ను ఏపీ ఎస్ ఈసీగా నియమించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిమ్మగడ్డ వ్యవహారంలో స్టే ఇవ్వాలన్న జగన్ సర్కార్ వినతిని సుప్రీం కోర్టు ఒకసారి కొట్టివేసింది. తాజాగా, గవర్నర్ కూడా నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది.
నిమ్మగడ్డ నియామకం వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం మరోసారి నిరాకరించింది. హైకోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదంటూ దేశపు అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ నియామకం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ సలహా ఇవ్వాలా..? అంటూ తీవ్రంగా స్పందించింది. మరోవైపు, తన విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయకుండా ఏపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ హైకోర్టులో నిమ్మగడ్డ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. రమేష్ కుమార్ వేసిన కోర్టు ధిక్కార పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. అయితే, సీజే సెలవులో ఉండడంతో నిమ్మగడ్డ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.