ఏపీలో రాజకీయ పవనాలు మారుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి సీమ వరకు కూడా పార్టీల పరిస్థితి మారుతోందనే సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ వర్గాల్లోనే ఈ చర్చ సాగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా వైసీపీ, టీడీపీలు వ్యక్తిగతంగా చేయించుకున్న సర్వేల్లోనూ ఈ మార్పు సంకేతాలు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ది లేదనే విషయం పెద్ద ఎత్తున ప్రజల మధ్య చర్చకు వస్తోంది. ఇదే విషయంపై సీఎం జగన్ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.
ముఖ్యమంత్రి జగన్ వివిధ పథకాల రూపంలో కొందరికి డబ్బులు ఇస్తున్నా.. ఇతర కుటుంబాల పరిస్థితిని గమనిస్తున్న వారు.. మాత్రం అభివృద్ధి లేదనే విషయాన్ని గుర్తిస్తున్నారు. మరోవైపు.. చంద్రబాబు ఇమేజ్ పెరుగుతుండడం కూడా మారుతున్న వాతావరణానికి దన్నుగా మారింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి వైసీపీకి వ్యతిరేకంగా మారుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
మరోవైపు..యువగళం పేరుతో టీడీపీ యువ నాయకుడు పాదయాత్ర దూకుడుగా ముందుకు సాగుతోంది. వైసీపీ ప్రభుత్వం మైనారిటీలకు మేలు చేసిందని ఒకవైపు ఆ వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వంటి వారు చెబుతున్నా.. ఆ తరహా సానుకూలత మైనారిటీ వర్గాల్లో కనిపించడం లేదు. ఇటీవల గుంటూరులోని పెదకూరపాడు నియోజకవర్గంలో గడపగడపకు కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ముస్లింలు బాయ్ కాట్ చేశారు.
ఇక, మరో ఎస్సీ నియోజకవర్గం ఏకంగా మంత్రి వస్తున్నారని తెలిసి.. పెద్ద ఎత్తున ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు రోడ్లపైకి చేరుకుని నినాదాలు చేశారు. తమకు ఈ ప్రభుత్వం చేసిందేంటని నిలదీశారు. దీంతో మొత్తంగా సంక్షేమం పనిచేయడం లేదనే సంకేతాలు ప్రజలనుంచి వచ్చాయి. వీటికితోడు చంద్రబాబు దూకుడు.. ప్రభుత్వ వైఖరి ఇలా.. అన్నీ కూడా.. మారుతున్న రాజకీయ పవనాలను స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని తాజాగా సీఎం జగన్ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో స్పష్టం కావడం గమనార్హం.