స్థానిక సమస్యలపై దృష్టి

లోకేష్ యువగళం పాదయాత్ర జోరుగా సాగుతోంది. గ్రామ గ్రామాన ఆగి టీడీపీ ప్రధాన కార్యదర్శి అందరితో మాట్లాడుతున్నారు. అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రోజా వర్సెస్ లోకేష్ ఓ రేంజ్ లో ఆరోపణాస్త్రాలు వినిపిస్తున్నాయి. నేతలు మాటకు మాట అనుకుంటున్నారు..

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జిల్లాల టూర్ కు బయలుదేరారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని మళ్లీ మొదలు పెట్టారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. చంద్రబాబును చూసేందుకు, ఆయన స్పీచ్ వినేందుకు జనం భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఆయన ప్రసంగంలో ప్రతీ మాటకు జనం కేరింతలు కొట్టారు.

చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ పవర్ ఫుల్ స్పీచులు ఇస్తున్నారు. ఇద్దరూ స్థానిక పరిస్థితులు, సమస్యలు అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. లోకేష్ ప్రతీ రోజు మహిళలు, దళితులు, వివిధ వృత్తుల వారితో కాసేపు కూర్చుని వారి బాగోగులు తెలుసుకుంటున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పెన్షన్లు రాకపోవడం దగ్గర నుంచి స్థానికంగా అధికారులు, వైసీపీ నేతలు వేధిస్తున్న తీరును కూడా మహిళలు ఏకరవు పెడుతున్నారు.

సమస్య మూలాల్లోకి వెళ్లి పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం లోకేష్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తమ పార్టీ అధికారంలోకి రాగానే క్షేత్ర స్థాయిలో సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇస్తున్నారు. పెన్షన్లను ఏకంగా రూ. 1,800 పెంచినదీ చంద్రబాబేనని గుర్తు చేస్తూ మూడేళ్లలో జగన్ పెంచినదీ రూ. 750 మాత్రమేనని లోకేష్ గుర్తుచేస్తున్నారు. ప్రజలను వేధించిన ఏ నాయకుడిని, ఏ అధికారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని చెబుతూ జనానికి భరోసా ఇస్తున్నరు.

జగ్గంపేట రోడ్ షోలో చంద్రబాబు గంటకు పైగా స్పీచ్ ఇచ్చారు. స్చీచ్లో ఆయన జగన్ తప్పిదాలతో పాటు ప్రజల సమస్యలను కూడా ప్రస్తావించారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టారు. వ్యవసాయానికి ఉపయోగించాల్సిన చెరువును చేపల చెరువుగా మార్చేశారన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్లో ఉద్యోగానికి రూ.10 లక్షలు లంచం తీసుకుంటున్నారన్నారు. మర్రిపాక, రామవరం గ్రామాల సమస్యలు ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరిస్తామన్నారు.

రాష్ట్ర స్థాయి సమస్యలను ప్రస్తావిస్తే జనానికి బోర్ కొడుతుందని భావిస్తున్న చంద్రబాబు, లోకేష్ ట్రాక్ మార్చి స్థానిక సమస్యలను ప్రస్తావిస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ హోల్ సేల్ గా అవినీతి చేస్తే ఎమ్మెల్యేలు, ఇతర నేతలు రిటైల్ గా దోచుకుంటున్నారని ఇద్దరు నేతలు ఆరోపిస్తున్నారు…