జేసీల‌ను వ‌దిలేసుకున్న‌ట్టేనా?

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు.. ఉమ్మ‌డి అనంత‌పురంలో ఫైర్ బ్రాండ్లుగా ఉన్న జేసీ బ్ర‌ద‌ర్స్‌ను చంద్రబాబు ప‌క్క‌న పెట్టేశారా? వారిని ప‌ట్టించుకోవ‌డం మానేశారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల కాలంలో తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వ‌ర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ల మ‌ధ్య తీవ్ర రాజ‌కీయ యుద్ధం సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌భాక‌ర్‌రెడ్డి కూడా రెచ్చిపోతున్నారు.

స‌వాళ్లు.. ప్ర‌తిస‌వాళ్లతో.. తాడిప‌త్రి అట్టుడుకుతోంది. ఏం ఎన్‌కౌంట‌ర్ చేస్తారా? అంటూ.. జేసీ ప్ర‌భాక‌ర్ చేసిన సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఇటీవ‌ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అయితే.. ఇంత‌గా ప్ర‌భాక‌ర్ రెడ్డి రెచ్చిపోయినా.. మ‌రోవైపు.. పోలీసుల నుంచి ఆయ‌న‌కు, ఆయ‌న కుటుంబానికి బెదిరింపులు వ‌స్తున్నా..టీడీపీ నాయ‌కులు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా సంఘీభావం తెల‌ప‌లేదు. అంతేకాదు.. ఈ విష‌యాన్ని అస‌లు తెలియ‌న‌ట్టే వ‌దిలేశారు.

ఇక‌, మ‌రోవైపు.. మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి.. నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌పై న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర‌లు వేస్ట్ అని.. వాటి వ‌ల్ల ఇప్పుడు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని.. కూడా చెప్పారు. నిజానికి ఈ వ్యాఖ్య‌లు.. యువ నేత చేప‌ట్టిన పాద‌యాత్ర‌పై ప్ర‌భావం చూపుతాయ‌ని.. పార్టీలో గుస గుస వినిపించింది. ఈ క్ర‌మంలో పార్టీ అదినేత కానీ, ఇత‌ర నాయ‌కులు కానీ.. రియాక్ట్ అవుతార‌ని.. ఆ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ, అలాంటిది కూడా ఏమీ జ‌ర‌గ‌లేదు. అస‌లు తాడిప‌త్రిలో ఏం జ‌రుగుతోందో కూడా టీడీపీ ప‌ట్టించుకుని కూడా స్పందించ‌డం లేదు. దీనిని బ‌ట్టి… జేసీ వ‌ర్గాన్ని.. ఆ కుటుంబాన్ని చంద్ర‌బాబు వ‌ద్ద‌నుకుంటున్నారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే జ‌రిగితే.. పార్టీకి పెద్ద‌గా న‌ష్టం అయితే లేద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ త‌ర‌ఫున క‌నీసం ఒక్క కార్య‌క్ర‌మం కూడా జేసీ బ్ర‌ద‌ర్స్ చేసింది లేదు. సో.. చంద్ర‌బాబుకు వారి వ‌ల్ల ఒరిగింది లేద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.