ఏపీ అధికార పార్టీ వైసీపీ అంటే.. క్రమశిక్షణకు మారు పేరు. పైకి ఎవరూ దీనిగురించి మాట్లాడరు. అమ్మో.. పార్టీలో క్రమశిక్షణ ఉందని చెప్పరు. కానీ, ఎవరూ కూడా అధినేత గీసిన గీత దాటరు. ఎవరూ పెదవి విప్పి పరుషంగా మాట్టాడే ప్రయత్నం కూడా చేయరు. దీనికి కారణం.. అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని చెప్పినా.. నిజానికి నేతలకు అంతర్గత కట్టుబాట్లు.. లక్ష్మణ రేఖలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ అంటే.. ఒకరకంగా హడల్ అనే చెప్పాలి.
దీంతో సీఎం జగన్ ఏం చెప్పినా.. ఆయన ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో నాయకులు పాటించి తీరుతారు. అవి కష్టమా? నష్టమా..? అనే ఆలోచన కూడా ఉండదు. ఖచ్చితంగా వాటిని పాటించి తీరాలనే భావిస్తున్నారు. పాటిస్తున్నారు కూడా. అయితే.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నాయకులు .. ఇప్పుడు ఈ పట్టును కోల్పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ ఇవ్వాలని అనేవారు పెరుగుతున్నారు.
నిన్న మొన్నటి వరకు ఎవరికి టికెట్లు కావాలన్నా.. అదినేతగా సీఎం జగన్ తీసుకునే నిర్ణయమే అంతిమం. అయితే.. ఇప్పుడు లక్షణ రేఖలు మారుతున్నాయి. కుంచించుకు పోతూ ఉన్నాయి. దీనికి కారణం.. తమకు వైసీపీ అవకాశం ఇవ్వకపోతే.. వేరే పార్టీలు రెడీగా ఉన్నాయనే సంకేతాలను.. నేతలు బాహాటంగానే పంపేస్తున్నారు. ఇదే జరిగితే.. వైసీపీ పెట్టుకున్న రెండోసారి అధికారం అనే లక్ష్యానికి తూట్లు పడడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి.
దీంతో ఇప్పటి వరకు ఉన్న లక్ష్మణ రేఖలను సీఎం జగన్ దాదాపు చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. అసలు నియోజకవర్గాలపై ఇప్పటి వరకు ఉన్న విధానం వేరు.. ఇకపై చూసే దృష్టి వేరు..అన్నట్టుగా సీఎం సంకేతాలు పంపించారు. అంటే.. ప్రజల్లో ఎక్కువగా ఉంటున్నవారు ఎవరు.. ఎవరికి ప్రజా బలం ఉంది.. అనే కోణాల్లో ఇప్పుడు సీఎం జగన్ ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు. దీనిని బట్టి.. అవసరమైతే.. ఇప్పటి వరకు పెట్టుకున్న లక్ష్మణ రేఖలను కూడా తోసిపుచ్చాలని.. పార్టీ గెలుపునకు ఎవరు దోహదపడతారో.. వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది.