ఏపీ ఎస్‌ఈసీ నియామకం వ్యవహారం ఇపుడు ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం నిమ్మగడ్డను ఎందుకు ఎస్ ఈసీగా నియమించలేదంటూ సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ నియామకంపై ఏపీ హైకోర్టు కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌పై స్టే కోరిన ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురైంది. మరోసారి స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో జగన్ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలంటూ ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. దీంతో, నిమ్మగడ్డ నియామకం దాదాపుగా తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును సీఎం జగన్ గౌరవించి నిమ్మగడ్డను తిరిగి ఎస్‌ఈసీగా నియమించాలని రఘురామకృష్ణంరాజు అన్నారు.
హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ నియామకం వల్ల ప్రభుత్వానికి కలిగే నష్టం ఏమీ లేదని ఆయన అన్నారు. న్యాయస్థానాలను గౌరవించి..న్యాయవ్యవస్థ విలువను కాపాడదామని, ఈ వ్యవహారానికి ఇంతటితో పుల్‌స్టాప్ పెడదామని అన్నారు. స్థానిక సంస్థలను వాయిదా వేసి నిమ్మగడ్డ మంచి నిర్ణయం తీసుకున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గమనించారని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం వెళ్లే అధికారం లేదని, చెప్పుడు మాటలు విని జగన్ ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకూడదని హితవు పలికారు. రాజ్యాంగంపై కనీస అవగాహన లేని కొందర తనపై ఫిర్యాదు చేసినా ఏమీ కాదని, ప్రజాప్రతినిధి గొంతు నొక్కేయడానికి ఇది రాచరికం కాదని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇప్పటికే నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీంకోర్టులో చుక్కెదురైన వైసీపీ ప్రభుత్వంపై ఆర్ ఆర్ ఆర్ వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్లున్నాయి. ఆల్రెడీ వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ…పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన రఘురామకృష్ణం రాజు….తాజాగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన నిమ్మగడ్డకు వత్తాసు పలకడం వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు. మరి, నిమ్మగడ్డ, రఘురామకృష్ణం రాజుల వ్యవహారాల్లో వైసీపీ అధిష్టానం నిర్ణయం ఏవిధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates